హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఆర్థికాభివృద్ధిలో ఏ ఇతర రాష్ర్టానికి అందనంత వేగంతో దూసుకుపోతున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలో అత్యుత్తమ వాణిజ్య, వ్యాపార మౌలిక వసతుల కల్పనలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అత్యధిక వస్తు, సేవలు ఎగుమతి చేస్తున్న మొదటి ఐదు రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండె క్స్ (ఈపీఐ) 2021 రెండో ఎడిషన్ నివేదికలో తెలంగాణపై ప్రశంసల వర్షం కురిపించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఐటీ, ఫార్మా పరిశ్రమలకు హబ్‌గా మారిందని కొనియాడింది. ‘భూ పరివేష్టిత రాష్ట్రమైన తెలంగాణ వ్యాపార మౌలిక వసతుల కల్పనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 100 స్కోర్ సాధించింది. నవకల్పనల్లో చూపుతున్న ప్రతిభ, తక్కువ ధరకే విద్యుత్తు అందుబాటులో ఉండటం వంటి కారణాలు ఇందుకు దోహదపడ్డాయి. హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా పరిశ్రమలకు హబ్‌గా మారింది. ఇది కూడా రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచేందుకు దోహదపడింది. డాటా సెంటర్ కేంద్రాలకు కూడా హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, క్లౌడ్ సొల్యూషన్ పరిశ్రమల్లో రాష్ట్రం అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది’ అని ప్రశంసించింది.
తెలంగాణ ప్రతిభ అసమానం
దేశం మొత్తం ఎగుమతుల్లో 75 శాతం కేవలం ఐదు రాష్ర్టాల నుంచే జరుగుతున్నాయని నీతి ఆయోగ్ తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు టాప్ 5 ఎగుమతుల రాష్ర్టాలని వెల్లడించింది. వీటిలో తెలంగాణ ఒక్కటే భూ పరివేష్టిత రాష్ట్రం.సముద్ర మార్గం లేకున్నా ఎగుమతుల్లో తెలంగాణ చూపుతున్న ప్రతిభ అసమానమని కొనియాడింది. ఎగుమతి వసతుల కల్పనలో దేశంలోని భూ పరివేష్టిత రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా 10వ స్థానం దక్కించుకొన్నది.
ఎగుమతుల వసతుల కల్పనలో ఐదో స్థానం అత్యుత్తమ ఎగుమతి సౌకర్యాలున్న భూ పరివేష్టిత రాష్ర్టాలు
రాష్ట్రం :ర్యాంకు :స్కోర్
హర్యారా :1: 53.20
ఉత్తరప్రదేశ్: 2 :51.09
మధ్యప్రదేశ్: 3 :51.03
పంజాబ్ :4: 50.99
తెలంగాణ: 5: 47.92
వివిధ అంశాల్లో తెలంగాణ ర్యాంకులు
అంశం : ర్యాంకు : స్కోర్
బిజినెస్ ఎకోసిస్టం : 7: 54.18
పాలసీ పిల్లర్ :12 :66.45
ఎక్స్పోర్ట్ ఎకోసిస్టం :12: 33.24
ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ :9 :31.67