
న్యూఢిల్లీ: పారిస్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ కోసం కేంద్ర క్రీడాశాఖ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న ప్లేయర్లకు క్రీడాశాఖ మద్దతుగా నిలుస్తున్నది. విశ్వక్రీడల్లో కచ్చితంగా గెలిచే అవకాశమున్న వారికి ఆర్థిక మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’(టాప్) స్కీమ్‌లో ఆరుగురు తెలంగాణ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఇందులో ఇషాసింగ్, ధనుశ్ శ్రీకాంత్, కైనాన్ చినాయ్(షూటింగ్), ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), పావని కుమారి(వెయిట్ లిఫ్టింగ్) ఉ న్నారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వం లో సోమవారం సమావేశమైన మిషన్ ఒలింపిక్ సెల్(ఎమ్వోసీ) కొత్తగా 20 మంది ప్లేయర్లకు చోటు కల్పించింది. దీంతో మొత్తం ప్లేయర్ల సంఖ్య 148కి చేరుకుంది. అయితే ఏడుగురు సభ్యులతో కూడిన ఎమ్వోసీ బృందం ఏడు ఒలింపిక్ విభాగాలతో పాటు ఆరు పారాలింపిక్ కేటగిరీల్లో అథ్లెట్లను ఎంపిక చేసింది. రానున్న రెండేండ్ల కోసం వీరికి టాప్స్ పథకం కింద కావాల్సిన ఆర్థిక, శిక్షణ సౌకర్యాలను క్రీడాశాఖ కల్పించనుంది. ఎమ్వోసీ ఈ నెలఖారులో మిగిలిన క్రీడా విభాగాలకు ప్లేయర్లను ఎంపిక చేయనుంది.