హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : దేశంలో వైద్య కళాశాలలు అధికంగా ఉన్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రం ఈ ఘనత సాధించింది. జాతీయ వైద్య మండలి లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎయిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఐఎన్ఐఎస్) కలిపి మొత్తం 818 వైద్య కళాశాలలు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించారు.
వీటిలో 88 యూపీలో, 85 మహారాష్ట్రలో, 78 తమిళనాడులో, 72 కర్ణాటకలో ఉన్నట్టు వివరించారు. తెలంగాణలో 37 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 29 ప్రైవేట్ వైద్య కళాశాలు ఉన్నట్టు తెలిపారు. దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేని జిల్లాలు, అత్యధిక జనాభా ఉన్న జిల్లాల్లో వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత వివరాలు తెలియజేయాలని పశ్చిమ బెంగాల్ ఎంపీ జగన్నాథ్ సర్కార్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని మెడికల్ కాలేజీల్లో 1,28,976 యూజీ, 85,020 పీజీ సీట్లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా 13.86 లక్షల మంది రిజిస్టర్డ్ అలోపతి వైద్యులు ఉన్నారని చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో వైద్యరంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. తెలంగాణలో వైద్యరంగాన్ని గాడిలో పెట్టేందుకు తగినంత మంది వైద్యులు అవసరమని భావించిన కేసీఆర్.. నాడు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు వైద్య కళాశాలల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన వైద్యవిద్య.. కేసీఆర్ చొరవ వల్ల రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడంతో నేడు మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించింది.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యవిద్యపై దృష్టి సారిస్తూనే మరోవైపు పేదలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో టిమ్స్, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణాన్ని చేపట్టింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో కనీసం మౌలిక వసతులైనా కల్పించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీంతో పలు వైద్య కళాశాలలు అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్నట్టు ఇటీవల వైద్యులు చేసిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మెడికల్ కాలేజీలపై దృష్టి సారించాలని, హైదరాబాద్లోని టిమ్స్తోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
