హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇటీవలికాలంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, క్షేత్రస్థాయిలో అమల్లో లోపాలు ఉండటం వల్ల కొన్ని అంశాల్లో వెనుకబడినట్టు చెప్పారు.
సోమవారం యూనిట్ అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాంకేతిక వనరులను స మర్థంగా వినియోగించి డాటా ఆధారిత పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమల్లో ఉన్న డిజిటల్ పోలీసింగ్ అప్లికేషన్లు, టీజీ కాప్యాప్స్, ఇతర సాంకేతిక వేదికల అభివృద్ధి, వాటి అమల్లో ఎదురవుతున్న సవాళ్లు, క్షేత్రస్థాయి సమస్యలపై సమావేశంలో విసృ్తతంగా చర్చించారు. ప్రస్తుతం చేపట్టిన డిజిటల్ కార్యక్రమాల్లో 60% పురోగతి సాధించామని, ఆశించిన స్థాయిలో అమలు జరుగలేదన్నారు.
పలు కీలక అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాన్ని నిర్వహించారు. కమిషనరేట్ల పరిధులు, పోలీస్ స్టేషన్ల లిమిట్లు, సరిహద్దు గ్రామాల విభజన తదితర అంశాలపై సంబంధిత కమిషనర్లతో చర్చించారు.సమావేశంలో హోంశాఖ కార్యదర్శి శిఖాగోయల్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, పోలీస్అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్త్, డీజీలు మహేష్‌భగవత్, వీ వీ శ్రీనివాసరావు, అనిల్‌కుమార్, స్వాతిలక్రా, హైదరాబాద్ కమిషనర్ సజ్జ్జనార్, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్‌నాయుడు, గజరావు భూపాల్, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, సైబరాబాద్ కమిషనర్ ఎం రమేశ్‌రెడ్డి, మలాజిగిరి కమిషనర్ సుమతి పాల్గొన్నారు.