హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): జాయింట్ యాక్షన్ టీమ్స్(జేఏటీ)ల వర్షాకాల సన్నద్ధత, విపత్తు నిర్వహణను బలోపేతం చేయడం కోసం తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం కీలకమని చెప్పారు. పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి జాయింట్ యాక్షన్ టీమ్‌లన్నీ నిరంతరం సమన్వయం కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు.
అనంతరం మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జీ సృజన, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్‌సింగ్, ఐఎండీ సైంటిస్ట్ జీఎన్ఆర్ శ్రీనివాసరావు, ఆర్మీ మేజర్ గోవింద్, హైడ్రా అడిషనల్ కమిషనర్ వీ పాపయ్య, ఫైర్ డైరెక్టర్ నారాయణరావు, మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరామ్ తదితర నిపుణులు వివిధ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.