సారంగాపూర్, డిసెంబర్ 11 : జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. సారంగాపూర్ కస్తూర్బా పాఠశాలలో బుధవారం ఉదయం 9 గంటలకు విద్యార్థినులు మేఘన, హర్షిత, అమూల్య, బీ మహిత, తోట వైష్ణవి, ఆవుత మమత, మ్యాకల నిహారిక, నడిమిట్ల కృష్ణవేణి, గోగుల తేజస్విని ఒక్కసారిగా కండ్లు తిరిగి కిందపడిపోయారు. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని సారంగాపూర్‌లోని పీహెచ్‌సీకి తరలించారు. మేఘన, హర్షిత, అమూల్యకు పీహెచ్సీలో చికిత్స అం దించగా మహిత, వైష్ణవి, మమత, నిహారిక, కృష్ణవేణి, తేజస్వినిని జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంచుకుని పంపించారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్, ఉప వైద్యాధికారి శ్రీనివాస్, వైద్యాధికారులు శివకుమారి, రాధ, డీఆర్డీవో రఘువరణ్, తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎంఈవో కిశోర్ పాఠశాలలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. దవాఖానలకు వెళ్లి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. జగిత్యాలలో విద్యార్థినులను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని, భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్నదని ఆరోపించారు. చలితీవ్రత పెరగడం, ఇద్దరికి ఆస్తమా ఉండడం, మరికొందరు రక్తహీనతతో బాధపడడంతోనే అస్వస్థతకు గురయ్యారని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. పాఠశాలలో పరిమితికి మించి పిల్లలు ఉన్నారని, బీర్పూర్ పాఠశాల, కాలేజీని ఇక్కడే నిర్వహిస్తుండడంతో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తేలు రాజు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో రోజూ ఏదో ఒకచోట ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు దవాఖానల పాలవడం ఆందోళన కలిగిస్తున్నదని, పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొన్నదని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగించిందని ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. పిల్లలకు కనీసం నాణ్యమైన ఆహారం కూడా అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఏడాది కాలంలో ఒకసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అకడి పరిస్థితులను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సంక్షేమ పాఠశాలలను సందర్శించాలని, వాటి పరిస్థితులపై సమీక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.