హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ.. భూగర్భ జలాలు పెరగటానికి దోహదపడిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జల్‌శక్తిశాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై బీజేపీ రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్న క్రమంలో కేంద్రప్రభుత్వమే స్వయంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించటం విశేషం. వైసీపీ ఎంపీ వంగ గీతావిశ్వనాథ్ భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, దీని కోసం కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమైనా ఉన్నాయా? అని కేంద్ర జల్శక్తిశాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఈ అంశం రాష్ర్టానికి చెందినదైనా, కేంద్రం కూడా భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేస్తున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ర్టాల వారీగా భూగర్భ జలాల మట్టాలపై జాబితాను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో భూగర్భ జలాల పెరుగుదలలో తెలంగాణ (84 శాతం) గణనీయ వృద్ధి సాధించి, మూడో స్థానంలో ఉన్నదని వెల్లడించారు. మొదటి స్థానంలో తమిళనాడు (86 శాతం), రెండో స్థానంలో కర్ణాటక (85 శాతం) ఉన్నాయని వివరించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దక్షిణాదికి చెందిన కర్ణాటక మినహా మిగతా రాష్ర్టాలన్నీ దిగువలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 74 శాతం, గుజరాత్లో 69 శాతం, మధ్యప్రదేశ్‌లో 66 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌లో 55 శాతం, హర్యానాలో 44 శాతమే ఉన్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ కాకతీయపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నీతిఆయోగ్, నీటి నిపుణులుకొనియాడారు. మిషన్ కాకతీయ స్ఫూర్తిగా మహారాష్ట్ర సర్కార్ జల్యుక్త్శివార్ పేరిట చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. అంతర్జాతీయ విద్యాసంస్థలు అమెరికాలోని మిషిగావ్ యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ విద్యార్థులు, శ్రీలంకలోని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పథకంపై అధ్యయనం చేసి, దీని విశిష్ఠతలను ప్రపంచానికి చాటారు.
మిషన్ కాకతీయ వల్ల స్వీడన్లో నిర్వహించిన అంతర్జాతీయ నీటి వారోత్సవాల్లో ప్రసంగించే అరుదైన ఘనతను తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకొన్నది. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్.. మిషన్ కాకతీయను ప్రశంసించి, తెలంగాణ సర్కారు కృషిని యావత్తు దేశానికి చాటాలని సంకల్పించారు. ఈ పథకం స్కోచ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) జాతీయస్థాయి అవార్డులను సైతం కైవసం చేసుకొన్నది. అటు.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి నదిలోని నీటిని రాష్ట్రంలోనే ఎత్తైన ప్రాంతానికి తరలించి, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో నీటిని నింపేలా చూశారు. ఫలితంగా తెలంగాణ సస్యశ్యామలమై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నది.