హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పోరాడి విజయం సాధించిన సీఎం కేసీఆర్.. దేశంలో జరుగుతున్న దారుణాలపై యుద్ధం ప్రకటించటం శుభ సూచకమని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. జాతీయ స్థాయిలోనూ తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు కావాలని, కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటానికి పూనుకోవాలని దేశ ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు.
బుధవారం హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకల్లో కేకే స్వాగతోపన్యాసం చేశారు. అసమర్థ కేంద్ర ప్రభుత్వంపై తిరగబడేందుకు కలిసి వచ్చే పార్టీలతో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషించే సమయం వచ్చిందని చెప్పారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా దానికి తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. రానున్న రోజుల్లోనూ టీఆర్ఎస్ను అజేయంగా ఉంచేందుకు కేసీఆర్ దగ్గర నిర్దిష్ట ప్రణాళిక ఉన్నదని తెలిపారు.
తెలంగాణను బాగు చేసుకొన్నట్టే, దేశాన్ని బాగు చేసే పనిలో కేసీఆర్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నా, విమర్శలు చేయటమే పనిగా పెట్టుకొన్నవాళ్లు దుష్ప్రచారాలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల అబ్ధాలు కేసీఆర్ ప్రభుత్వం ముందు నిలవవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష ధోరణి.. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకం కల్పిస్తున్నదని విమర్శించారు.
రైతులు పండించిన పంటను కొనటానికి కేంద్రం రకరకాల ఆంక్షలు పెట్టిన తీరు దుర్మార్గమని మండిపడ్డారు. ఏ విషయంలోనూ రాష్ట్రానికి సహకరించకుండా మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రగతి వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న నేతలను రకరకాలుగా వేధిస్తున్నారని వెల్లడించారు. నిజాలు మాట్లాడే వారి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ, దాని అనుబంధ సంస్థలు మతపరమైన అంశాలు తెరపైకి తెస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రంగంలో చూసినా దేశానికి తెలంగాణ తలమానికంగా మారిందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగించబట్టే రాష్ట్రంలో ఇంతటి మార్పు సాధ్యమైందని చెప్పారు.