సూర్యాపేట, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారు డు రిషివర్ధన్‌రెడ్డి (21) సోమవారం మలేషియాలోని సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ మేరకు అక్కడి అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రిషివర్ధన్‌రెడ్డి కేరళలోని ఓ ఎజెన్సీ ద్వారా ఫిబ్రవరిలో మలేషియాకు వెళ్లి మర్చంట్ నేవీలో పని చేస్తున్నాడు. వారం కింద ట ఫోన్‌చేసి విధుల్లో ఒత్తిడి చేస్తున్నారని, త్వరలోనే మరో షిప్‌లోకి మారుతానని చెప్పిన ట్టు తల్లిదండ్రులకు గుర్తు చేశారు. అక్కడ ఉద్యోగం మానేసి ఇంటికి రమ్మని చెప్పామని, ‘ఎంతో ఖర్చుచేసి ఇక్కడి దాకా వచ్చాను.. వేరే షిప్‌లోకి వెళ్తే ఇబ్బందులేమీ ఉండవు’ అని తమను సముదాయించాడని చెప్పారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు.