అవ్.. అన్నా.. హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది. ఏం కావాలన్నా ఇక్కడే దొర్కుతాంది. బిహార్, లేదంటే ఇంకేదో రాష్ర్టానికో పోవాల్సిన అవసరం లేదు. వస్తారు, పని కానిచ్చేస్తారు, పోతారు. అంతే… ఇది ఓ సినిమాలో డైలాగ్. అవును. నిజంగానే భాగ్యనగరి మస్తు డెవలప్ అయ్యింది. దేశం తలతిప్పుకుని చూసే స్థాయి నుంచి తలతిప్పేందుకే భయపడే స్థాయికి ఎదిగింది. కేవలం రెండేండ్ల కాంగ్రెస్ పాలనలోనే రాజధాని మాత్రమే కాదు రాష్ట్రమే నేరాలకు అడ్డాగా మారింది. నేరాల్లో ఉత్తరాది రాష్ర్టాలతో తెలంగాణ పోటీ పడుతుండటం తలవంపే తప్ప మరేమీ కాదు.
పింఛన్లు, బంగారం, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్, జీరో కరెంట్ బిల్లు.. ఇలా ఏదైతేనేం కాంస్ ఇచ్చిన అన్ని హామీలు అటకెక్కినయ్. కాంగ్రెస్‌ను నమ్మిన పాపానికి అనుభవించాల్సి వస్తున్నది. అనుభవం పాఠాలు నేర్పుతుంది అనేది లోకోక్తి. రోజులు గడుస్తున్న కొద్దీ మెరుగుపడే అవకాశాలు అందిపుచ్చుకుంటారని కొందరు సమర్థించుకున్నారు. అలా చేస్తే వెరైటీ ఏముంది అనుకుంటున్నారో ఏమోగానీ రోజురోజుకు పాలన అధ్వానంగా, అసహ్యంగా తయారవు తున్నది. కొత్తగా ఏదైనా చేసి ముక్కున వేలేసుకునేలా చేస్తారనుకుంటే, ఇంతకన్నా చెత్తపనులు మనం చూడమేమో అన్నట్టుగా పనితనం చూపిస్తున్నారు.
అధికారంలోకి వచ్చీరాగానే కాళేశ్వరం మీద పడ్డరు. ఎక్కడో పగుళ్లు అంటూ అంతా అటెన్షన్ అన్నట్టుగా జనాలను అటు తిప్పారు. పోయిన సర్కార్‌పై బురదజల్లేందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. సర్కార్ అనాలోచిత వైఖరితో కాళేశ్వరం ఖాళీ అయ్యింది, పంటలు ఏడ్పుముఖం పెట్టినయ్, రైతులు నేల చూపులు చూస్తున్నారు, అప్పులు ఆకాశానికి అంటినయ్, తీర్చే గత్యంతరం లేక దూలాలకు, చెట్లకు, పురుగుమందు డబ్బాలకు తమను తాము అర్పించుకుని మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రపంచమే అబ్బురపడిన చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పాలకులు పూర్తి నిరుపయోగంగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇక రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్న భూతోన భవిష్యతి అన్నట్టుగా మరింత భయాందోళన కలిగిస్తున్నది. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో, శాంతిభద్రతల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇచ్చారు. వినూత్న చర్యలు చేపట్టారు. నాడు పోలీసు వ్యవస్థ బలోపేతం కోసం కేసీఆర్ తీసుకున్న చర్యలను కూడా విమర్శించిన ప్రబుద్ధులను చూశాం.
ఎందరు ఏమనుకున్నా బీఆర్ఎస్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గకుండా రాష్ట్రం శాంతివనంగా ఉంటేనే పెట్టుబడుల చెట్లు మహా వృక్షాలుగా ఎదుగుతాయని, ప్రజలు కంటినిండా కునుకు తీస్తారని నమ్మి తనపని తాను చేసుకుంటూ వెళ్లింది. పోలీసులకు కొత్త వాహనాలు, చిన్నచిన్న మండలాలకు కూడా పోలీస్ స్టేషన్లు, ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఎమర్జెన్సీ సర్వీసులు తీసుకొచ్చింది. రాజధాని హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను యావత్ భారతదేశమే అబ్బురపడేలా నిర్మించారు. నేరాలను అరికట్టి సత్ఫలితాలను చూపించారు.
రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? ఎక్కడో మారుమూల గ్రామాలు, తండాలు మాత్రమే కాదు, మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాద్, రెండో రాజధాని వరంగల్‌లో నడిరోడ్డుపై పట్టపగలే జరిగిన ఘటనలను ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా వారం రోజుల కిందట హైదరాబాద్ నడిమధ్యలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను దుండగులు ఇంట్లోనే హత్య చేయడం చూస్తుంటే శాంతిభద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
స్వయంగా ఓ మహిళా పోలీసు ఉన్నతాధికారి రాత్రిపూట రాజధాని వీధుల్లో మహిళలు ఎలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారో ప్రత్యక్షంగా నిరూపించారు. ఇక ఆడపిల్లలు రోడ్లపై ధైర్యంగా నడిచేది ఎలా? రేవంత్ సర్కార్ ప్రజలకు భరోసా కల్పించడం దేవుడెరుగు మాకు ఇబ్బందులున్నాయి మహాప్రభో అని స్వయంగా మొరపెట్టుకుంటుంటే కూడా బాసటగా నిలిచే అవకాశాలు కనుచూపు మేరలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించకుండా చేయడమే దయనీయం. ఇప్పుడు రాష్ట్రంలో నయా ట్రెండ్ క్రైమ్ నడుస్తున్నది. రోజుకో ఖూనీ, కొత్త రకం నేరాలు రాష్ట్రంలో అడ్డావేసి, వికటాట్టహాసం చేస్తున్నాయి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. కానీ నిందితుడు పరారీలో ఉంటే, రాష్ట్ర సర్కార్ అండగా నిలుస్తున్న తీరు యావత్ రాష్ర్టాన్ని నోటమాట రాకుండా చేస్తున్నది. నిందితుడికి ప్రభుత్వం బాసటగా నిలుస్తున్న పద్ధతిని ప్రజలంతా గమనిస్తున్నారు.
బాధిత కుటుంబం న్యాయం చేయండి పెద్దలారా.. అని పోలీసులను వేడుకొంటే, నిందితుడిని అరెస్ట్ చేయడం కాదు కదా.. కనీసం ఆచూకీ కూడా కనిపెట్టకుండా చేస్తున్న జాప్యం అనుమానాలకు తావిస్తున్నది. రేవంత్‌రెడ్డి సర్కార్ తీరుతో అనుమానాలకు బలం చేకూరుతున్నది. స్టేషన్ మెట్లు ఎక్కాలంటే బాధితులే భయపడేలా, నిందితులే కాలర్ ఎగరేసేలా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే, నోటికొచ్చిన హామీలు ఇస్తే ప్రజలు నమ్మి మోసపోయారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నా, పాలన సంతృప్తికరంగా సాగుతున్నా.. కాంగ్రెస్ ఇంకా ఏదో చేస్తామంటూ నమ్మబలికింది. ఒకటికి రెండు, రెండుకు నాలుగు ఇస్తామనేసరికి ప్రజలు బోల్తాపడ్డారు. నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ బండారం బయటపడింది. రాష్ర్టానికి మరకలు, మచ్చలు అంటించే పని చేయడం తప్ప మరేమీ కనిపించడం లేదని జనం నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. చేతనైతే సాయంగా నిలవాలిగానీ, చేష్టలుడిగి చూస్తూ జీవితాలతో ఆడుకోవద్దని చెప్తున్నారు.