Inter Exams | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలను 80 మార్కులకే నిర్వహించనున్నారు. మరో 20 మార్కులకు ఇంటర్నల్స్/ప్రాజెక్ట్ వర్క్స్ చేపట్టనున్నారు. ఈ దిశగా ఇంటర్‌బోర్డు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్నది. సిలబస్, పరీక్షావిధానంలో మార్పులపై చర్చలు నడుస్తున్నాయి. ఇంటర్‌బోర్డు పచ్చజెండా ఊపితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి 80 మార్కులకే వార్షిక పరీక్షలను నిర్వహించి, మరో 20 మార్కులకు ఇంటర్నల్స్ నిర్వహిస్తారు.
ఇప్పటి వరకు ఫస్టియర్ విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇంటర్నల్స్‌గా నిర్వహిస్తున్నారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను రెగ్యులర్ మార్కులకు కలపడం లేదు. గతంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్‌ను సైతం ఇంటర్నల్ పరీక్ష రూపంలో నిర్వహించేవారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌ను నిర్వహించడంతో ఈ పరీక్షను రద్దుచేసి ప్రస్తుతం బ్యాక్లాగ్ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రతిపాదిత ఇంటర్నల్స్‌లో 20 మార్కులుంటాయి. ఈ మార్కులను రెగ్యులర్ మార్కులకు కలుపుతారు. అసైన్మెంట్లు/ప్రాజెక్ట్‌లు విద్యార్థులే సొంతం గా రాయాలి. ఇంటర్నెట్, వికీపీడియా నుంచి కాపీకొట్టడానికి వీల్లేదు. చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ సహాయం తీసుకోకుండా విద్యార్థులు సొంతంగా అధ్యయనం చేసి ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.