ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆదాయం తగ్గింది. రాష్ట్ర ఖజానాకు మే నెలలో భారీగా తగ్గిపోయింది. జూలై నుంచి తిరిగి కోలుకొని సాధారణ స్థాయిలో రాబడి నమోదవుతున్నది. జూలై, ఆగస్టులో రూ.10 వేల కోట్ల మార్క్‌ను అందుకున్నది. సెప్టెంబర్‌లో రూ.9,250 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.6,918 కోట్ల కంటే దాదాపు 34% అధికం. ఈసారి పన్నుల రూపంలోనే దాదాపు రూ.1,670 కోట్లు అదనంగా వచ్చినట్టు రాష్ట్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రాష్ర్టానికి రూ.53 వేలకోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇది గతేడాది కంటే 40% అధికం. రాష్ర్టానికి ప్రతినెలా సగటున రూ.9-10 వేలకోట్ల ఆదాయం వస్తుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆదాయం తగ్గింది. ముఖ్యంగా మే నెలలో భారీగా తగ్గిపోయింది. జూలై నుంచి తిరిగి కోలుకొని సాధారణ స్థాయిలో రాబడి నమోదవుతున్నది. జూలై, ఆగస్టులో రూ.10 వేల కోట్ల మార్క్‌ను అందుకున్నది. సెప్టెంబర్‌లో రూ.9,250 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.6,918 కోట్ల కంటే దాదాపు 34% అధికం. ఈసారి పన్నుల రూపంలోనే దాదాపు రూ.1,670 కోట్లు అదనంగా వచ్చినట్టు ఆర్థికశాఖ వెల్లడించింది.
బడ్జెట్ అంచనాల్లో 36.11%
ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల (జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజులు, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నులు) ద్వారా రూ.1.06 లక్షలకోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా.. తొలి 6 నెలల్లో అన్నిరకాల ఆదాయ మార్గాలు, రుణాలు కలిపి 36.11% వచ్చింది. ఇది గతేడాదితో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం (34.72%) కంటే కొంచెం ఎక్కువ. ఈ సంవత్సరం పన్నుల ఆదాయం బాగానే ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం (నాన్-ట్యాక్స్ రెవెన్యూ) మాత్రం ఆశించినంతగా రాలేదు. బడ్జెట్ అంచనాలతో పోల్చితే పన్నేతర ఆదాయం కేవలం 7.97 శాతమే వచ్చింది.