స్వయంగా అడ్వొకేట్ జనరల్ రెండు రోజుల క్రితం ఇచ్చిన హామీకి విరుద్ధంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటే ఏమనుకోవాలి. మళ్లీ అలానే వ్యవహరిస్తే ఆర్మీని పిలిచి హైడ్రా అధికారులను బ్యారక్‌లో ఉంచాలని ఆదేశించగలం. వివాదాస్పద ప్రైవేట్ స్థలం రక్షణ కోసం పది మంది ఆర్మీ సిబ్బందిని సిద్ధం చేయాలి. స్థలంలోకి వచ్చే హైడ్రా సహా వారికి మద్దతుగా ఎవరైనా ప్రవేశించినా ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకుని బ్యారక్స్‌కు తరలించాలి. వాహనాలను కూడా సీజ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం లేకపోవడంతో ఆర్మీకి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్రం బయట ఏం జరుగుతున్నదో సచివాలయంలో కూర్చున్నవారికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది.
-హైకోర్టు
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై మిలిటరీ యాక్షన్‌కు ఆదేశిస్తామని రాష్ట్ర హైకోర్టు హెచ్చరించింది. ఆర్మీజోన్లో ఉన్న వివాదాస్పద స్థలం రక్షణకు అవసరమైతే సైన్యా న్ని రంగంలోకి దింపుతామని పేర్కొన్నది. తమ ఆదేశాలను కాదని ఎవరైనా వస్తే అదుపులోకి తీసుకొని ఆర్మీ బ్యారక్స్‌లో పడేయాలని, కోర్టులో హాజరుపరుచాలని సైన్యాన్ని కోరుతామని వ్యాఖ్యానించింది. హైడ్రాను ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరుగనివ్వబోమని స్పష్టంచేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంటనే సీనియర్ బ్రిగేడియర్‌ను సంప్రదించి, 10 మంది ఆర్మీ సిబ్బందిని నియమించేలా కోరాలని ఆదేశించింది. రాష్ట్ర యంత్రాంగంపై విశ్వాసం సన్నగిల్లడంతో న్యాయపాలన రక్షణలో భాగంగా ఆర్మీని పిలిపించక తప్పడం లేదని స్పష్టంచేసింది. సచివాలయంలో కూర్చొన్న వాళ్లకు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలియాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆ భూమి లో ఎవరు అడుగుపెట్టినా అదుపులోకి తీసుకోవాలని సైన్యానికి సూచిస్తామన్నది. అయితే చివరి నిమిషంలో అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వుల జారీని నిలిపివేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
మేడ్చల్ -మలాజిగిరి జిల్లా మలాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వేనంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీనిని సవాల్‌చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యవసరంగా సోమవారం మరో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రైవేట్ ఆస్తులకు దూరంగా ఉండాలని గతంలోనే రంగనాథ్‌ను ఆదేశించామని పేర్కొన్నారు. అయినా మరోసారి కూల్చివేతలు చేపట్టడంపై మండిపడ్డారు. ‘ఈ వివాదంలో కోర్టు ఇప్పటికే రెండుసార్లు ఉత్తర్వులు వెలువరించింది. వాటిని లెకచేయకుండా మూడోసారి హైడ్రా అధికారులు తమ భూమిలోకి ప్రవేశించారని పిటిషనర్ చెప్తున్నారు. ఒకే వ్యవహారంపై వరుసగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు కావడం అత్యంత తీవ్రమైన విషయం’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది.
గత విచారణకు రంగనాథ్ నేరుగా హాజరయ్యారని, మరోసారి ఆ భూమిలో అడుగుపెట్టబోమని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ మళ్లీ ఆ భూమిలోకి హైడ్రా అధికారులు వెళ్లడం అంటే న్యాయవ్యవస్థను అవమానించడమే అవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆయనను దూరంగా ఉండమని చెప్పండి. లేదంటే కేంద్ర హోంశాఖకు, రక్షణ మంత్రిత్వశాఖకు చెప్పి ఆర్మీని రంగంలోకి దించుతాం’ అని వ్యాఖ్యానించారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఆయనకు ప్రభుత్వం అండ ఉండొచ్చని, అంతమాత్రాన ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లొచ్చని కాదని చెప్పారు. ఆ స్థలం ఆర్మీజోన్లో ఉన్నది కాబట్టి దాని రక్షణకు ఆర్మీనే రంగంలోకి దించాలని, ఈ మేరకు బైసన్ విభాగం సీనియర్ గ్రేడ్ బ్రిగేడియర్‌తో సంప్రదింపులు జరుపాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. సబ్ లెఫ్టినెంట్ హోదా ఉన్న అధికారి నేతృత్వంలో లాన్స్‌నాయక్ హోదా ఉన్న 10 మంది ఆర్మీ సిబ్బందిని అక్కడ మోహరించాలని, వారి పేర్లను శక్రవారం ఇవ్వాలని కోరాలని పేర్కొన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాస్పద భూమిలోకి హైడ్రా వెళ్లరాదని, అవసరమైతే పైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తాము గతంలోనే సూచించామని జస్టిస్ అనిల్‌కుమార్ గుర్తుచేశారు. కానీ, అలా చేయకుండా మళ్లీ ఆ ప్రాంతంలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ‘మీరు చట్టానికి అతీతులని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. మేమేంటో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా అక్కడ అడుగుపెడితే అదుపులోకి తీసుకొని, ఆర్మీ బ్యారక్‌లో పడేయాలని సైన్యానికి సూచిస్తామని పేర్కొన్నారు. వారి వాహనాలను కూడా సీజ్ చేయాలని, ఆ తర్వాత వారిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరుతామని చెప్పారు. ‘మా తీర్పును అమలు చేయాలని మిమ్మల్ని బతిమిలాడుకోవాల్సిన అవసరం కోర్టుకు లేదు. ఇది న్యాయస్థానాన్ని తీవ్రంగా అవమానించడమే. ఈ దేశ న్యాయవ్యవస్థ శక్తి ఏమిటో కూడా ఆయనను తెలుసుకోనివ్వండి’ అని వ్యాఖ్యానించారు.
సాధారణంగా ఆర్మీని రంగంలోకి దించకూడదనే విషయం తమకు తెలుసని, అయితే న్యాయపాలనలో భాగంగా తప్పడం లేదని జస్టిస్ అనిల్‌కుమార్ వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోరాదన్న స్పృహ కోర్టుకు ఉన్నది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం లేకపోవడంతో ఆర్మీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తున్నది’ అని పేర్కొన్నారు. ‘ఒక సీనియర్ ఐపీఎస్ అధికారే మా ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఇక రాష్ట్రంలోని మిగతా అధికారులు పట్టించుకొంటారని ఎలా అనుకుంటాం’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో సచివాలయంలో కూర్చొన్నవారికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
హైడ్రాను ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. బయట ఇష్టమొవచ్చినట్టు వ్యవహరిస్తూ, కోర్టుకు వచ్చి నచ్చిన రీతిలో సమాధానం ఇస్తున్నారని మండిపడింది. రాష్ట్రంలో ఇలాంటి అరాచకం కొనసాగడానికి వీళ్లేదని స్పష్టంచేసింది. ‘అసలు రెవెన్యూలో మీకేం పని?’ అని ప్రశ్నించింది. ‘మీరు కావాలంటే ఏదైనా చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సైన్యాన్ని రంగంలోకి దింపుతాం’ అని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం హరీశ్‌కుమార్ వాదనలు వినిపించారు. మరోసారి పిటిషనర్ స్థలంలోకి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 20న హైకోర్టులో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దానిని ఉల్లంఘిస్తూ ఈ నెల 22న హైడ్రా యంత్రాంగం పిటిషనర్ స్థలంలోకి వచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోల ఆధారాలను కోర్టుకు సమర్పించారు. వాటిని న్యాయమూర్తికి అందజేశారు. ఈ నెల 21న పిటిషనర్ తన స్థలంలో పునరుద్ధరణ పనులు చేపట్టగా హైడ్రా అధికారులు, పోలీసులతో వచ్చి పనుల్లో జోక్యం చేసుకొన్నారని చెప్పారు. అప్పీల్ వేయబోతున్నామని, ఎలాంటి పనులు చేపట్టరాదని హెచ్చరించారని తెలిపారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. హైడ్రా అధికారులు వివాదాస్పద స్థలంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్ సమర్పించిన ఫొటోల్లో హైడ్రా వాహనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఫొటోలను ఏ సమయంలో, ఏ తేదీన తీశారో కూడా వాటిపై ఉన్నదని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ఉత్తర్వుల ప్రత్యక్ష ఉల్లంఘనే అవుతుందని తేల్చిచెప్పారు.
కోర్టు ఉత్తర్వులు సాయంత్రానికి అందుబాటులోకి వస్తాయనే దశలో అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆయన విచారణకు హాజరై, పిటిషనర్‌కు చెందిన భూమిలోకి హైడ్రా అధికారులు వెళ్లబోరని హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ, అధికారి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత పరిశీలిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. దీంతో ఉత్తర్వుల జారీ నిలిచిపోయింది.
ప్రభుత్వమైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని జస్టిస్ అనిల్‌కుమార్ స్పష్టంచేశారు. డివిజన్ బెంచ్ తీర్పు అమల్లో ఉండగా ప్రైవేట్ భూమిలోకి ఎలా ప్రవేశిస్తారని నిలదీశారు. ప్రభుత్వ భూమిని రక్షించే పేరుతో ఏ చట్ట నిబంధనల ప్రకారం కోర్టు ఉత్తర్వులను పకన పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైనా చట్టానికి అతీతులు కాదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని గుర్తుచేశారు.
గత విచారణ సమయంలో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇవ్వడంతో కోర్టు వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా హైడ్రా చర్యలు ఉన్నాయంటే, న్యాయవ్యవస్థ నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడమేనని తప్పుబట్టారు. కోర్టు ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, కానీ ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఈ దశలో మరోసారి అదనపు ఏజీ ఖాన్ కల్పించుకొని చివరిసారిగా మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి తోసిపుచ్చారు. వివాదాస్పద స్థలం రక్షణ కోసం ఆర్మీని రంగంలోకి దింపాలంటూ ఆదేశాలను డిక్టేట్ చేశారు. ఉత్తర్వుల ప్రతులను కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలకు, బైసన్ విభాగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు.