అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఇటీవల తన 111వ సినిమా షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన కాలి కండరాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆయన మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సుశిక్షితులైన వైద్యబృందం పర్యవేక్షణలో మూడు గంటల పాటు శస్త్ర చికిత్స జరిగిందని, అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని ఏఐజీ ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ గౌతమ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.