హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : పరస్పర కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదికగా చేసుకోవాలనుకుంటే అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టంచేసింది. నిర్మల్‌లోని పంగిరి గ్రామ ఎంపీయుపీఎస్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉన్న ప్రభురాజ్సాగర్పై 2022లో ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నిజామాబాద్‌కు చెందిన మాజీ ప్రధానోపాధ్యాయుడు పీ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభురాజ్సాగర్ దూరవిద్య చేస్తూ తరగతులకు హాజరుకాలేదని, ఫోన్ వినియోగించేవారని 2022లో ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ 2017లో ఉద్యోగ విరమణ చేసిన ఐదేండ్ల తరువాత ఫిర్యాదు చేశారని తెలిపారు. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి పిటిషన్ దాఖలు చేసినట్టుందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఇలాంటి పిటిషన్లను అనుమతించలేమని స్పష్టంచేశారు. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ..ఆ మొత్తాన్ని మలక్‌పేట అంధ బాలికల పాఠశాలకు చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.