టెహ్రాన్: ఇప్పటికే హొర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోయి ప్రపంచ దేశాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న క్రమంలో అగ్రరాజ్యంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒక వేళ అమెరికా కనుక ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఎర్ర సముద్ర చమురు మార్గాన్ని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులను కోరింది.
ఇది ప్రపంచ ఇంధన సరఫరాలకు మరింత తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని మూడు వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. ఇప్పటికే ఈ ఆలోచనపై ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం చర్చలు జరిపి, ఆ సందేశాన్ని హౌతీ మిత్రపక్షాలకు చేరవేర్చిందని రెండు సీనియర్ ఇరాన్ వర్గాలు, ఈ అంశంతో సంబంధం ఉన్న మరో వర్గం వెల్లడించినట్టు రాయిటర్స్ తెలిపింది.