Pawan Kalyan OG | ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు న్యాయస్థానం అంగీకరించలేదు. ‘ఓజీ’ బెనిఫిట్ షోలకు, ఆ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులే అక్టోబర్ 9వ తేదీ వరకు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలని అనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ బెంచ్.. ‘ఓజీ’ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే రాబడిని వీధి పిల్లలు, అనాథల సంక్షేమం కోసం ఖర్చు చేస్తారా? అని నిలదీసింది. ‘ఓజీ’ బెనిఫిట్ షోలను, ఆ సినిమా టికెట్ రేట్ల పెంపుదలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ‘ఓజీ’ సినిమా టికెట్లను 18 ఏండ్లలోపు వారికి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తోపాటు ‘ఓజీ’ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్కు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఓజీ’ బెనిఫిట్ షోలకు, ఆ సినిమా టికెట్ రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన బీ మల్లేశ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.