గట్టుప్పల్, సెప్టెంబర్ 26 : గొర్రెల యూనిట్ల పంపిణీ పథకం ప్రభుత్వం కొనసాగించాలని గొర్రెల, మేకల పెంపకదారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సాగర్ల మల్లేష్ అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో గొర్రెల మేకల పెంపకందారుల మండల మహాసభ అచ్చిన శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మల్లేష్ మాట్లాడుతూ డీడీలు కట్టి పెండింగ్లో ఉన్నటువంటి గొర్రెల పెంపకందారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని, ఫ్రీజింగ్ చేసిన పెంపకందారుల బ్యాంక్ అకౌంట్ల ప్రీజింగ్ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, జీవాలకు ఇన్సూరెన్స్ కొనసాగించాలన్నారు. 559, 10, 16 జీఓలను అమలు చేయాలని, ఫారెస్ట్ భూముల్లో జీవాలను మేపకుండా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సంవత్సరానికి నాలుగు దపాలుగా నట్టల మందులు త్రాపించడంతో పాటు, సీజన్లో వచ్చే అన్ని రకాల వ్యాధులకు మందల వద్దే వ్యాక్సిన్ వేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పశు వైద్య పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతీ యువకులకు సబ్సిడీ రుణాలు అందజేయాలన్నారు. గొర్రెల, మేకల పెంపకం దారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్లో పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 30న మునుగోడు మండల కేంద్రంలో జరిగే గొర్రెల, మేకల పెంపకందారుల జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం గొర్రెల మేకల పెంపకదారుల సొసైటీ అధ్యక్షుడు కొండే సత్తయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, జెర్రిపోతుల ధనంజయ, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ముసుకు బుచ్చిరెడ్డి, బండ నరేందర్, సుర్గి యాదయ్య, రావుల వెంకటయ్య, మందుల శంకరయ్య, కుందే రాజు పాల్గొన్నారు.