హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వారికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ జారీచేసిన ఉత్తర్వులు చట్టం ముందు నిలబడవని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీ జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, కే సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత ఏ మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన 10 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు కొనసాగిస్తూ అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని, ఇవి చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వాదనలను విన్న బెంచ్ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.