హైదరాబాద్, జనవరి 31 : డ్రిప్ స్కీమ్ 2 ఫేజ్ పథకంలో భాగంగా రూ.645.13 కోట్లతో రాష్ట్రంలోని 29 పురాతన డ్యామ్‌లు, జలవనరులను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పురాతన డ్యామ్‌లు, జలవనరులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా ఈ పనులను చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాగునీటి శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా రూ.5 కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రపంచబ్యాంకు నుంచి పొందిన రూ.10,211 కోట్లతో దేశవ్యాప్తంగా 736 జలవనరులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకాన్ని అమలుచేస్తున్నది. ఈ పథకానికి 2020 అక్టోబర్ 29న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పథకం కింద ఎంపికైన పనులకు అయ్యే వ్యయంలో కేంద్రం 70%, రాష్ర్టాలు 30% నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరాలని సూచిస్తూ కేంద్ర జల్‌శక్తిశాఖ పరిధిలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అధికారులు ఆయా రాష్ర్టాలతో గతంలోనే పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. తెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులతోనూ ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతినిధులు పలు విడుతలుగా చర్చలు సాగించిన నేపథ్యంలో ఈ పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.