హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో బుధవారం జీవో జారీ చేసింది. కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ క్యాటగిరీని ఏర్పాటు చేయడంతోపాటు అన్ని థియేటర్లలో ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటిలో ఒక షోను చిన్న సినిమాలకు కేటాయింంచింది.
‘సినీ కార్మిక సంక్షేమ నిధి’కి రూ.1 కోటి విరాళం ఇచ్చే చిత్రాలకే టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది. 7.1 సౌండ్ సిస్టమ్, 2కే లేదా 4కే స్రీన్ ఉన్న థియేటర్లను ‘స్పెషల్ థియేటర్స్’ క్యాటగిరీలో చేర్చింది. ప్రేక్షకులపై అధిక భారం పడకుండా చూసేందుకు ప్రతి థియేటర్లో కనీసం 25% సీట్లను నాన్-ప్రీమియం క్యాటగిరీలో ఉంచాలని పేర్కొన్నది.
సింగిల్ స్రీన్, ఏసీ, నాన్-ఏసీ, స్పెషల్ థియేటర్లకు ప్రభుత్వం వేర్వేరు టికెట్ ధరలను నిర్ణయించింది. నాన్-ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్ ధర రూ.30 నుంచి రూ.70 వరకు, ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.100 వరకు ఉండేలా పరిమితులు విధించింది. ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.150, ప్రీమియం టికెట్ ధర రూ.100 నుంచి రూ.200 వరకు ఉండాలని నిర్ణయించింది.
స్పెషల్ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్ ధర రూ.100 నుంచి రూ.250 వరకు ఉండాలని పేర్కొన్నది. రూ.100 కోట్లకుపైగా బడ్జెట్తో నిర్మించిన సినిమాలకు ‘సూపర్ హై బడ్జెట్’ హోదా కల్పిస్తున్నట్టు పేర్కొన్నది. ఇలాంటి చిత్రాలకు మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది.