న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలను వ్యవస్థాగతం చేయవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. రాధాకృష్ణన్ కమిటీ, నందన్ నీలేకని కమిటీ సిఫార్సుల అమలుకు తీసుకున్న చర్యల గురించి తమకు తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్టీఏలో సంస్కరణలను వ్యవస్థాగతం చేయాలని, ప్రవేశ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి సాంకేతిక మార్పులు అవసరమని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో పరీక్ష విధానంలో సంస్కరణలు, డాటా భద్రతా విధానాల మెరుగుదల, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుపై సిఫార్సులు చేయడానికి విద్యా శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. పోటీ పరీక్షల్లో నిర్మాణాత్మక సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇది ఒక సంస్థాగత సమస్యని, దీనికి వ్యవస్థాగత విధానం అవసరమని రాధాకృష్ణన్ కమిటీ సరిగ్గానే పేర్కొంది. అదే ఇందులో అత్యంత కీలకమైన అంశం.
కాగితంపై చూస్తే ఈ ప్రక్రియ అంతా బాగుంటుంది. కానీ ఒక పరీక్ష జరిగిన తర్వాత రెండో పరీక్ష సమయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్టీఏకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, ఇతర సాంకేతిక సామర్థ్యాలను సమకూర్చాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నందన్ నీలేకని కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ సూచనలపై మూడు వారాల్లోగా ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.