హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయన్న ఆ రోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యం లో మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల హామీ నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ తొందరపాటు నిర్ణయాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోనున్నదా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ సర్పం చ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో పాటించాల్సిన విధివిధానాలను నిర్దారిస్తూ సీఎస్ రామకృష్ణారావు శనివారం జీవో 46ను విడుదల చేశారు.
ఈ జీవో విధివిధానాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వార్డు స భ్యుల రిజర్వేషన్లు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, ఆర్థిక, కుల (ఎస్ఈఈఈపీసీ) సర్వే-2024 ఆధారంగా ఖరారు చేయాలని జీవోలో పేర్కొన్నారు. సర్పంచ్ స్థా నాల్లో ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెకల ఆధారంగా, బీసీలకు మాత్రం ఎస్ఈఈఈపీసీ సర్వే ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించాలని పేర్కొన్నారు. ఒకే రిజర్వేషన్ ప్రక్రియ లో రెండు వేర్వేరు కాలాల జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయం లో ఎస్ఈఈఈపీసీ సర్వేకు చట్టబద్ధత ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఈ జీవో హైకోర్టు న్యాయ సమీక్షకు నిలుస్తుందా? అనే అనుమానాలూ వస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నుంచి తప్పించుకోవడానికే ఈ జీవోను తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జీవోలో మార్గదర్శకాలను పొందుపర్చారు. ఎస్టీ రిజర్వేషన్లు తొలు త ఖరారు చేసి, ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు కేటాయించాలి. రొటేషన్ పద్ధతిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో (2019) రిజర్వ్ చేసిన వార్డులు/సర్పంచ్ పదవులను తిరిగి అదే వర్గానికి మళ్లీ రిజర్వ్ చేయకూడదు. ఎస్టీ జనరల్, ఎస్టీ (మహిళలు), ఎస్సీ జనరల్, ఎస్సీ (మహిళలు), బీసీ జనరల్, బీసీ (మహిళలు), జనరల్, జనరల్ (మహిళలు)ను ప్రత్యే క క్యాటగిరీలుగా పరిగణించాలి. రిజర్వేషన్ల కేటాయింపులో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అవరోహణ క్రమంలో పరిగణించాలి.
మిగిలిన రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చే స్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ క్యాటగిరీల లో సగం స్థానాలను మహిళలకు కేటాయించాలి. ఇందులో 0.5ను సున్నాగా పరిగణించాలి. మహిళా రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఖరారు చేయాలి. షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్ర త్యేక నిబంధనలు పెట్టారు. షెడ్యూల్డ్ ప్రాం తాల్లో రిజర్వేషన్లు ఆయా వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉంటాయి. 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్లను ఎస్టీలకే కేటాయించాలి. హైదరాబాద్, మేడ్చల్-మలాజిగిరి జిల్లాలు మినహా 31 జిల్లాల్లో ఈ మార్గదర్శకాల ప్రకారం చర్య లు తీసుకోవాలని పేర్కొన్నారు. బీసీలకు 23, ఎస్సీ 17 నుంచి 19, ఎస్టీ 8 నుంచి 9 % రిజర్వేషన్లను కేటాయించే అవకాశం ఉన్నది.
