Andhra Pradesh | హైదరాబాద్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిదోపిడీ విషయంలో దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే వివిధ రూపాల్లో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ సర్కార్.. ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్)ని సిమెంట్ లైనింగ్ చేపట్టి 89,762 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఆ మేరకు గుట్టుగా శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ లైనింగ్ పనులు చేపడుతున్నది. దీనిపై అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ లేఖ రాశారు. వెంటనే లైనింగ్ పనులను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టం ప్రకారం.. కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉన్నది.
కానీ అందుకు విరుద్ధంగా ఏపీ సర్కారు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల, 80వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ (పీఆర్పీ) విస్తరణకు పూనుకున్నది. రూ. 6,829.15 కోట్లతో పనులను చేపట్టేందుకు 203 జీవోను ఏపీ సర్కారు గతంలోనే జారీ చేసింది. అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ పనులతోపాటుగా, పీఆర్పీ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ వరకు గల 44వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులు చేపడుతున్నది. రాయలసీమ లిఫ్ట్ పనులపై హరిత ట్రిబ్యునల్ ఇప్పటికే స్టే విధించింది. అయినా ఏపీ తన తీరును మార్చుకోలేదు. కొద్దిరోజులుగా ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులను ముమ్మరంగా కొనసాగిస్తుండటం గమనార్హం. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ విస్తరణ పనులు చేపడుతున్నదని తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపైన కూడా ఇటు జీఆర్ఎంబీకి, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి, సీడబ్ల్యూసీకి తెలంగాణ సర్కారు మరోసారి ఫిర్యాదు చేసింది. 200 టీఎంసీల గోదావరి వరద జలాలను పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ సర్కారు ఈ ప్రాజెక్టును చేపడుతున్నది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండటం, మరోవైపు కేవలం ప్రణాళిక దశలోనే ఉన్నదని, డీపీఆర్ సిద్ధం కాలేదని ఇటీవలే ఏపీ బుకాయించడం గమనార్హం. తాజాగా ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల సమీకరణకు జలహారతి పేరిట ఏపీ ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మరోసారి జీఆర్ఎంబీ, పీపీఏ, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. తక్షణం పనులను నిలిపుదల చేయించాలని డిమాండ్ చేసింది.