హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కార్ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (సీపెక్ సర్వే) ఫలితాలను మంత్రులు ఇటీవల అట్టహాసంగా విడుదల చేశారు. కానీ, ఈ భారీ గణాంకాల సేకరణ వెనుక శ్రమించిన లక్ష మందికి పైగా ఎన్యుమరేటర్ల కష్టాన్ని మాత్రం విస్మరించారు. సర్వే ముగిసి 17 నెలలు గడుస్తున్నా, నేటికీ తమకు రావాల్సిన పారితోషికం కోసం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు కండ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ‘పని మాది.. క్రెడిట్ మీది.. మరి పైసలెవరివి? అంటూ సరార్ను నిలదీస్తున్నారు. 2024 నవంబర్ 9న మొదలైన సర్వేలో భాగంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సుమారు 10,000 మంది సూపర్వైజర్లు అహర్నిశలు శ్రమించారు.
ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకో దరఖాస్తుకు రూ.20 చొప్పున చెల్లిస్తామని చెప్పి, డాటా ఎంట్రీ ఆపరేటర్ల చేత రాత్రింబవళ్లు పని చేయించుకున్నారు. సగటున ఒకో ఆపరేటర్‌కు రూ.6 వేలు అందాల్సి ఉండగా, 17 నెలలైనా నయాపైసా విదిల్చలేదు. త్వరలోనే జాతీయ జన, కుల గణన మొదలుకానున్నది. ఇందుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ రావాల్సి ఉన్నది. ఏడాదిన్నర క్రితం నెలపాటు కష్టించి పనిచేసిన వారి పారితోషికానికి దిక్కులేదు. జాతీయ జనగణన కూడా చేయమంటున్నారని, వీటి డబ్బులు తీసుకోవడానికి ఎంతకాలం ఎదురుచూడాల్సి ఉంటుందోనని ఎన్యుమరేటర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,16,14,349 ఇండ్లను సందర్శించిన ఎన్యుమరేటర్లు, 75 రకాల ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అనేక ఛీతారాలు, అవమానాలు ఎదురొన్నప్పటికీ, ఉన్నతాధికారులు విధించిన లక్ష్యాలను పూర్తి చేశారు. సర్వే పూర్తయిన పది రోజుల్లోనే నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని నాడు ప్రభుత్వం నమ్మబలికింది. కానీ, నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. సర్వే పారితోషికం కోసం ప్రభుత్వం రూ.50.90 కోట్లు మంజూరు చేసినట్లు గొప్పగా చెప్తున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయి సిబ్బందికి చేరకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని జిల్లాల్లో నామమాత్రంగా చెల్లింపులు జరిపి, మెజారిటీ జిల్లాల్లో బకాయిలను అలాగే ఉంచడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఎన్యుమరేటర్లు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించి, వినతిపత్రాలు సమర్పించారు. తక్షణమే తమ బకాయిలు చెల్లించకుంటే మున్ముందు ప్రభుత్వ కార్యక్రమాలను బహిషరిస్తామని హెచ్చరిస్తున్నారు.
సీపెక్ సర్వే కోసం నెల రోజులు ఇల్లిల్లూ తిరిగి సర్వే చేసి ఎంపీడీవోకు వివరాలతో కూడిన పేపర్లు అందించాం. ఒక పూట పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించి, మరో పూట సీపెక్ సర్వే నిర్వహించినం. ఒకటి కాదు.. రెండు కాదు 17 నెలలుగా నాకు రావాల్సిన 10 వేల కోసం ఎదురుచూస్తున్నాం. సర్వే పారితోషికానికి సంబంధించి ఎవరినీ అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఎంపీడీవో విధులు కేటాయించారు కానీ, వేతనాల గురించి అడితే మా దగ్గరకు రాలేవు అని చెప్తున్నారు.
కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించి పలుమార్లు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటికి 17 నెలలు అయింది. నేటికీ సర్వే పారితోషికం అందలేదు. త్వరలో జాతీయ జన, కులగణన మొదలు కాబోతున్నది. నేటికీ పాత డబ్బులకు అతీగతీ లేదు. జాతీయ కులగణన పారితోషికం ఎప్పుడొస్తదో ఏమో!’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీచర్ ఆవేదన వ్యక్తంచేశారు.