హైదరాబాద్, జనవరి 10 : రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకోవటం బీజేపీకి పగటి కలే అవుతుందని తెలంగాణ కల్లుగీత గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీ, దళిత, బహుజన వర్గాలకు బీజేపీ చేసింది శూన్యం అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కల్లు గీత వృత్తిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ర్టాల్లో కల్లు గీతకు సంబంధించిన లైసెన్సులు సైతం రద్దు చేశారని మండిపడ్డారు. గీత వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తూ, కావాల్సిన పరిహారాన్ని సకాలంలో అందిస్తున్నదని తెలిపారు.