హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): కల్లు దుకాణాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గౌడ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తచేశారు. రేవంత్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కల్లు డిపోలు ముమ్మాటికీ రాజకీయ వేదికలేనని గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ తెలిపారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమో, కాంగ్రెస్ పార్టీవో స్పష్టంచేయాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన డిమాండ్‌చేశారు. కల్లుగీత వృత్తికి పునర్వైభవం తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టంచేశారు. సమావేశంలో సంఘం నేతలు బబ్బురు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గౌడల ఆత్మగౌరవ, ప్రతికలైన కల్లు దుకాణాలను కించపర్చేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ డిమాండ్‌చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లు దుకాణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజకీయ చైతన్య వేదికలని పేర్కొన్నారు.