హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్‌కు సెమీకండక్టర్ల పరిశ్రమ ఎండమావిగానే కనిపిస్తున్నది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ రంగాలకు కీలకమైన చిప్‌లను తయారు చేసే ఈ పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒడిశా, ఏపీ, పంజాబ్ రాష్ర్టాలకు మంజూరు చేసింది. మంగళవారం మంజూరైన ఈ 4 పరిశ్రమలతో కలిపి దేశంలో మొత్తం సెమీకండక్టర్ల పరిశ్రమల సంఖ్య 10కి చేరనున్నది.
వీటిలో 9 పరిమ్రలు ఎన్డీఏ పాలిత రాష్ర్టాల్లోనే ఉండటం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు రెండు సెమీకండక్టర్ కంపెనీలు వచ్చినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అవి వెనక్కు వెళ్లిపోయాయి. సెమీకండక్టర్ల తయారీలో మన దేశం స్వావలంబన సాధించేందుకు కేంద్రం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను ఏర్పాటు చేసింది. గతంలో గుజరాత్‌కు నాలుగు, అసోం, యూపీకి ఒక్కోటి చొప్పున 6 సెమీకండక్టర్ పరిశ్రమలను మంజూరు చేసింది.
తాజాగా మరో 4 సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. వాటిలో ఒడిశాకు రెండు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌కు ఒకొక్కటి చొప్పున మంజూరు చేసింది. సిక్సెం, కాంటినెంటల్ డివైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(సీడీఐఎల్), 3డీ గ్లాస్ సొల్యూషన్స్ ఇంక్, అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ కంపెనీలు మొత్తం రూ.4,594 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నాయి. ప్రత్యక్షంగా 2,034 మందికి, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సేవలను అందిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఇంటెల్, శాన్ డియాగోకు చెందిన క్వాల్కమ్ కంపెనీలు ప్రాసెసర్లను అభివృద్ధి చేస్తుండగా, మైక్రోచిప్ టెక్నాలజీ ఇంక్ సంస్థ మైక్రో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోలర్లను ఉపయోగించి విస్తృత శ్రేణి ఎంబెడెడ్ కంట్రోల్ సొల్యూషన్స్‌ను అందిస్తున్నది. జర్మనీకి చెందిన ఇన్ఫినియస్ టెక్నాలజీ సంస్థ సెమీకండక్టర్, హార్డ్‌వేర్ డిజైన్లను రూపొందిస్తుండగా, టెస్సోల్వ్ కంపెనీ సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రీ, పోస్ట్ సిలికాన్ సేవలను అందిస్తున్నది.
మైక్రాస్ సంస్థ కంప్యూటర్ మెమరీ, డాటా స్టోరేజ్ సొల్యూషన్స్‌ను అందిస్తున్నది. హార్డ్‌వేర్ రంగంలో మోస్చిప్ సంస్థకు ఉన్న నైపుణ్యం టెలికాం, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాల ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నది. మిరాఫ్రా సంస్థ సెమీకండక్టర్ల డిజైన్ సేవలను అందిస్తుండగా.. ఏఎండీ సంస్థ అంతర్గత ప్రాసెసర్లు, గ్రాఫిక్స్ కార్డులు మరియు అడాప్టివ్ సిస్టమ్స్ ఆన్ చిప్స్‌లను, ఎన్విడియా సంస్థ అధునాతన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేస్తున్నది. వీటిలో సింహభాగం కంపెనీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొలువుదీరాయి. ఇన్ని బహుళజాతి కంపెనీలున్న తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి.
ఆప్టికల్ కమ్యూనికేషన్స్, సెమీకండక్టర్ మెటీరియల్స్, డిస్ప్లే టెక్నాలజీస్ తదితర రంగాల్లో ప్రసిద్ధిగాంచిన కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కంపెనీతోపాటు ఔట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(ఓఎస్ఏటీ)కి సంబంధించిన దిగ్గజ సంస్థ కేన్స్ సెమికాన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముందుకొచ్చాయి. దీంతో రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటవుతుందని అందరూ భావించారు. కానీ, తెలంగాణలో ప్రభుత్వం మారగానే ఆ రెండు కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోయాయి. కేన్స్ సెమికాన్ గుజరాత్‌కు, కార్నింగ్ ఇంటర్నేషనల్ తమిళనాడుకు వెళ్లిపోయాయి.