వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చెప్పారు. మూడేళ్లలో తూర్పులో జరిగిన అభివృద్ధిపై శుక్రవారం వరంగల్‌లోని ఓ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ నగర అధ్యక్షుడిగా రెండుసార్లు, ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా, మేయర్‌గా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవకాశం కల్పించారు. వారికి రుణపడి ఉంటాను. పార్టీ కోసం అనేక హోదాల్లో పనిచేశా. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేశాను. ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా. నన్ను ఆశీర్వదించిన ప్రజలకు మరింత సేవ చేసేందుకు వెనకడుగేయను. మా ఏకైక ఎజెండా పేదరిక నిర్మూలన. పేదలు ఆత్మగౌరవంతో బతకడం, వారి కలలు నిజం చేయడం కోసం నిజాయితీగా పనిచేస్తా. భవిష్యత్‌లో వరంగల్ తూర్పును మరింత అభివృద్ధి చేస్తాను.’ అని అన్నారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా..
‘వరంగల్ తూర్పు అభివృద్ధికి గొప్ప బాటలు వేస్తు న్నాం. చరిత్రలో మునుపెన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. రాజకీయాలు ఎన్నికలప్పుడే.. ప్రజాసేవ శాశ్వతం. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నా. ఆరు దశాబ్దాల్లో జరుగని అభివృద్ధిని చేస్తున్నాం. వరంగల్ తూర్పు దిశ, దశను మార్చుతు న్నాం.’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరంగల్‌కే తలమానికంగా రూ.1,100 కోట్లతో సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖానను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో నిర్మించుకుంటున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద దవాఖాన అన్నారు. పేదలు రోగమస్తే హైదరాబాద్‌కు వెళ్లకుండా ఇకడే కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. వరంగల్ తూ ర్పు తలరాతను మార్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్, మం త్రి కేటీఆర్‌ను ఒప్పించి వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, కలెక్టరేట్‌ను పేదల ఇండ్ల నడుమ ఆజంజాహి మిల్లు గ్రౌండ్లో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. తద్వారా ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయన్నారు. ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వ్యా పారాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. ఖిలా వరంగల్ టూరిజంలో అభివృద్ధి చెందుతుందన్నారు. పేదల ఆస్థి విలువ పెరుగుతుందన్నారు. వరంగల్‌లోని శివనగర్ తదితర ప్రాంతాలు తీవ్ర ముంపునకు గురవుతున్న నేపథ్యంలో అగడ్తా నుంచి నీరు 12 మోరీలలోకి చేరేలా రూ.239 కోట్లతో అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మిస్తున్నామని, ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్ బ్రిడ్జి విస్తరణతో పాటు కొత్త వెంట్ నిర్మించి వారికి కానుకగా ఇచ్చామన్నారు.
త్వరలో గుడిసెవాసులకు పట్టాలు..
మేయర్‌గా ఉన్నప్పుడే ఈ ప్రాంత అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించామన్నారు. రూ.205 కోట్లతో నియోజకవర్గంలోని 18 ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టామన్నారు. పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు దాదాపు రూ.110 కోట్లతో దూపకుంటలో 2000, జర్నలిస్టులు, ప్రజల కోసం దేశాయిపేటలో 200 డబు ల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నామని, దాదాపు అవి చివరి దశలో ఉన్నాయన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, అది మరికొద్ది రోజుల్లో నిజం కానుందని తెలిపారు. జీవో నంబర్ 58 ద్వారా గుడిసెవాసులకు పట్టాలు అందించాలని అసెంబ్లీలో మాట్లాడానని అన్నారు. సుమారు 5,200 మంది గుడిసె వాసుల కల త్వరలో నెల నెరవేరనుందని చెప్పారు.
పన్నెండు ప్రాంతాల్లో కొత్తగా బస్తీ దవాఖానలు రాబోతున్నాయని, ఎల్బీనగర్లో రూ.2 కోట్ల కుడా నిధులతో షాదీఖానా కట్టబోతున్నామన్నారు. రంగశాయిపేటలో ఐదెకరాల్లో నాబార్డు నిధులతో డిగ్రీ కళాశాల భవనం నిర్మిస్తామన్నారు. రూ.256 కోట్లతో ఇంటర్నల్ రోడ్లు, శ్మశానవాటికలు నిర్మించామని తెలిపారు. రూ.16 కోట్లతో ఉర్సు ట్యాంక్ బండ్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, చిన్నవడ్డేపల్లి చెరువు ట్యాంక్ బండ్ పనులు కూడా రూ.6 కోట్లతో చేస్తామన్నారు. లక్ష్మీపురం వద్ద రూ.27 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నాగమయ్య టెంపుల్ వద్ద రూ.4.50 కోట్లతో మరో మినీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామన్నారు. రూ.270 కోట్లతో రంగశాయిపేట నుంచి ఎనుమాముల వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని చెప్పారు. దేశాయిపేట వల్ల మహిళా రెసిడెన్సియల్, కాశీబుగ్గ, శివనగర్‌లో మోడల్ శ్మశానవాటికలను నిర్మిస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనను ముందుకు నడిపిస్తున్నారన్నారు. వరంగల్ నేతన్నలు తయారు చేసిన దుస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టి వారికి బాసటగా నిలిచామన్నారు. తనను గెలిపించిన ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో రాజకీయాలకతీతంగా 25వేల పేద కుటుంబాలకు లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు అందజేశానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతాభివందనాలు తెలిపా రు. టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. అలాగే, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ రిజ్వా నా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు గుండేటి నరేందర్, పోశాల పద్మ, కల్పన, మరుపల్ల రవి, టీఆర్ఎస్ ముఖ్య నేతలు టీ రమేశ్‌బాబు, కావేటి వెంకట్‌గౌడ్, రాజ్‌కిశోర్, నవీన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో మూడేళ్లలో రూ.3,348 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వెల్లడించారు. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మూడేళ్లలో తూర్పులో జరిగిన అభివృద్ధిపై శుక్రవారం వరంగల్‌లోని ఓ గార్డెన్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ అంతా తూర్పుదేనని, అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధి మూడేళ్లలో చేసి చూపించామన్నారు. ‘ప్రజల కోసమే పనిచేస్తున్నాం.. లారీ డ్రైవర్ కొడుకు, పేదింటి బిడ్డ, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో చూపిస్తున్నాం. రాజకీయాలు ఎన్నికలప్పుడే.. ప్రజలు బాగుండడమే మా ఎజెండా.. ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేయట్లేదు.. ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాను.’ అని అన్నారు.