ఇల్లందకుంట: దళితబంధు పథకం ఎన్నికల స్టంట్కాదని, ఇది దళితుల తలరాత మార్చే పథకమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని దళితులతో సుంకె రవిశంకర్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితబంధు పథకంతో దళితులు ఎక్కడ ఎదుగుతారోనని ప్రతిపక్షాలలో ఈర్ష్య మొదలైందని సుంకె రవిశంకర్ విమర్శించారు. అందుకే దళితబంధుపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు వివరించారు. మూడేళ్లలో ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రైతుబంధు మాదిరిగా దళితబంధు పైసలు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టంచేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సింహగర్జనైనా..సంక్షేమ పథకమైనా కరీంనగర్ నుంచే మొదలవుతుందని, ఈ గడ్డ విజయాలకు కేరాఫ్ అడ్రస్ అని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఎవరూ ఆగంకావొద్దని సూచించారు.