హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ఏ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని కోరారు.
ఢిల్లీలో గురువారం నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానంతరం ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోరైల్ ఫేజ్-2 విస్తరణ, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనుల ప్రతిపాదనలను ఆమోదించాలని విన్నవించారు. భూసేకరణ ఖర్చులో 50శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడమేగాక, ఎన్హెచ్ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసిందని, 90 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని వివరించారు.
చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్-అమరావతి-బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతివ్వాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించాలని, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరారు.