హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో ఆటో కార్మికులతో కలిసి భోజనం చేస్తూ, వారి ఖర్చులు, కష్టాలపై ముచ్చట్లుపెడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించాలని తెలంగాణ ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు గడుస్తున్నా రూ.12వేల భృతి, సంక్షేమ బోర్డు ఊసు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తమ ఉపాధి మీద తీవ్ర ప్రభావం చూపిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఆటో డ్రైవర్ల ఆదాయం రోజుకు రూ.800 నుంచి రూ.1,000 వరకు ఉండగా, ఉచిత బస్సు పథకం నేపథ్యంలో గణనీయంగా పడిపోయిందని చెప్తున్నారు.
దీనికితోడు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల పెరుగుదల, వాహనాల నిర్వహణ ఖర్చులు, ఫైనాన్స్ వాయిదాలు, బీమా, పర్మిట్ ఫీజులు ఆటో డ్రైవర్లపై అదనపు భారంగా మారాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యాప్ ఆధారిత క్యాబ్ సేవలు, షేరింగ్ వాహనాల పోటీ కారణంగా సంప్రదాయ ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గింది. రోజంతా కష్టపడ్డా కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రావడంలేదనేది ఆటో డ్రైవర్ల ఆవేదన. ఫైనాన్స్ కంపెనీలకు ఈఎంఐలు కట్టలేక, పిల్లల సూల్ ఫీజులు చెల్లించలేక, రోజువారీ కుటుంబపోషణ భారం కావడంతో ఆటో కార్మికులు అప్పుల వలయంలో చిక్కుకొంటున్నారు. నమ్మి ఓటేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం తమను నట్టేట ముంచిందని ఆటో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఆదాయం లేక, అప్పులు పుట్టక, ఈఎంఐలు కట్టలేక, కుటుంబ బాధలు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 100 మందికిపైగా ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారని తోటి ఆటో కార్మికులు చెప్తున్నారు. గతంలో ప్రజాభవన్ ఎదుట ఒక గిరిజన ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయి, తీవ్ర నిరాశతో తన ఆటోకు తానే నిప్పుపెట్టుకున్న ఘటన సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సిరిసిల్ల, మియాపూర్, వరంగల్, ఖమ్మం వంటి అనేక ప్రాంతాల్లో ఆటో కార్మికులు తమకు న్యాయం చేయాలని నిరసనలు వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని.. కానీ, దానివల్ల రోడ్డున పడ్డ తమ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో సుమారు 6.5 లక్షల మంది ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయి అల్లాడుతుంటే.. రాహుల్‌గాంధీ మాత్రం ఢిల్లీలో ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని, వారితో సెల్ఫీలు దిగుతూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని ఆటో యూనియన్ల నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఇచ్చినమాట నిలబెట్టుకోలేని వారు, ఢిల్లీలో చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారని మండిపడుతున్నారు. ఢిల్లీ ఆటోడ్రైవర్లే శ్రమజీవులా? తెలంగాణ కార్మికులు కాదా? అని నిలదీస్తున్నారు. ఇకనైనా రాహుల్‌గాంధీ తమ గోడు వినాలని, ఇచ్చిన హామీలను అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని కోరుతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం ప్రతి ఆటో డ్రైవర్‌కు వెంటనే ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం విడుదల చేయాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, వారి పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి ఆటో కార్మికులను ఆదుకోకపోతే, రాబోయే రోజుల్లో తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.