
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతికత వినియోగంతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ధనూకా గ్రూప్ చైర్మన్ రామ్గోపాల్ అగర్వాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ధనూకా గ్రూప్ ఆధ్వర్యంలో డ్రోన్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయం తో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను వినియోగించి వ్యవసాయ దిగుబడులను పెంచుకోవడం ఎలా అనే అంశంపై నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ధనూకా కంపెనీకి అత్యాధునిక సాంకేతిక పంట రక్షణ ఉత్పత్తులు ఉన్నాయని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో తమ గ్రూప్ ఒప్పందం చేసుకున్నట్టు అగర్వాల్ ప్రకటించారు. రెండు సంస్థలు సాంకేతిక పరిజ్ఞానంపై సమిష్టిగా పనిచేయడంతోపాటు రైతులకు భారీస్థాయిలో మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. వర్సిటీ నిర్వహించే సదస్సుల్లో గ్రూప్ పాల్గొంటూ స్పాన్సర్ చేస్తుందని చెప్పారు. వర్సిటీతో కలిసి ఉమ్మడిగా పంట రక్షణ పరిశోధనలు చేయనున్నట్టు తెలిపారు.