హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం తెలంగాణ ప్రజలు మోస్తుండగా, ప్రతిఫలాలు మాత్రం బీజేపీ పాలిత రాష్ర్టాలు అందుకుంటున్నాయి. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నది. దేశానికి పెద్దన్న పాత్ర పోషించాల్సిన మోదీ తెలంగాణపై శీతకన్ను చూపుతున్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఐదేండ్లలో తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి రూ.4.32 లక్షల కోట్లు (3.87 శాతం) సమకూర్చింది. కానీ, రాష్ట్రానికి తిరిగి వచ్చింది కేవలం రూ.1.84 లక్షల కోట్లు (2.45 శాతం) మాత్రమే.
ఇదే సమయంలో బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రూ.3.32 లక్షల కోట్లు (2.97 శాతం) పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించి.. రూ.3.23 లక్షల కోట్లు (4.30 శాతం) తిరిగి పొందింది. ఇది రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించిన వాస్తవం. తెలుగు రాష్ట్రమైన ఏపీకి కేంద్రం ఎకువ నిధులు ఇస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ తెలంగాణకు ఇంత అన్యాయం చేయడాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో తెలంగాణకు కేంద్రం న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గత ఐదేండ్లలో (2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య) కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన నిధులు ఎన్ని? తిరిగి రాష్ట్రాలకు బదిలీ చేసిన పన్నుల వాటా, గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధులు ఎన్ని? అని ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నులు, గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండగా, తిరిగి రాష్ట్రానికి వస్తున్న కేంద్ర నిధులు మాత్రం తక్కువగా ఉన్నట్టు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేంద్రం నుంచి వాటా నిధులు ఎక్కువగా వెళ్తుండగా, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ర్టాలకు తక్కువగా ఇస్తున్నారు. పన్నుల వాటా, గ్రాంట్లు, కేంద్ర పథకాల ద్వారా నిధుల బదిలీలో దక్షిణాదికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రాల నుంచి కేంద్ర ఖజానాకు వెళ్లిన మొత్తం పన్నుల వివరాలను (డైరెక్ట్ ట్యాక్స్, జీఎస్టీ వసూళ్లు) గమనిస్తే.. తెలంగాణ నుంచి గత ఐదేండ్లలో రూ.4.32 లక్షల కోట్లు వెళ్లాయి. మొత్తంగా కేంద్ర పన్నుల్లో మన వాటా 3.87 శాతంగా ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఎకువ పన్నులు సమకూర్చినట్టు స్పష్టమవుతున్నది. కానీ, మనకు కేంద్రం నుంచి రూ.1.84 లక్షల కోట్లు, 2.45 శాతం మాత్రమే వస్తున్నాయి. నిధులు బదిలీలో వెనుకబడి ఉన్నా, పన్నుల రూపంలో తెలంగాణ నుంచే కేంద్రానికి అధిక ఆదాయం లభిస్తున్నది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ చేయడం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెకల్లో కేంద్ర ఖజానాకు రాష్ట్రాలు అందించే వాటాను 15వ ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకోలేదని మంత్రి చెప్పారు.