Munipally | మునిపల్లి: మునిపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు (Teachers) ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మునిపల్లి మండల విద్యాధికారి భీమ్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మండలంలోని మేళసంఘం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి రోహిణి సస్పెండ్ చేశారు. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వీరన్న (మ్యాథ్స్), భానుప్రకాష్ (ఫిజికల్ సైన్స్) ఉపాధ్యాయులు కొంతకాలంగా పాఠశాలకు వచ్చి సంతకం చేసి, పాఠాలు బోధించకుండా బయటకు వెళ్లి, పాఠశాల ముగిసే సమయానికి వచ్చి సంతకం చేసి ఇంటికి వెళ్తున్నారు.
రెండు రోజుల క్రితం ఈ పాఠశాలను జిల్లా విద్యాధికారి (DEO) రోహిణి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. స్కూలుకు వచ్చి సంతకం చేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చిన ఆ ఉపాధ్యాయులపై డీఈవో మండిపడ్డారు. ఆ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శశికళ, సిబ్బంది ఉషారాణి, మోహన్ బాబులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రిన్సిపల్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీఈవో అన్నారు.

Melasangham
పట్టించుకోని విద్యాధికారి
మునిపల్లి విద్యాధికారి (MEO) భీమ్ సింగ్ పర్యవేక్షణ లేకపోవడంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇష్టం వచ్చినట్లు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో విధుల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు మునిపల్లి చౌరస్తా, బుధేరా చౌరస్తా, కంకోల్ గ్రామాల్లోని టీ కొట్టు, హోటళ్ల వద్ద కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఈవో భీమ్ సింగ్ ముంబై జాతీయ రహదారికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు తప్ప మండల కేంద్రంలోని దూరంగా ఉన్న పాఠశాలలను తనిఖీ చేయకుండా నిర్లక్ష్యంగా
వ్యవహరిన్నారని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలు (12), ప్రాథమిక ఉన్నత పాఠశాలలు (8), ప్రాథమిక పాఠశాలల (31) ఉన్నాయి. వీటిల్లో 4,680 మంది విద్యార్థులు చదువుతున్నారు. 282 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు లేకపోవడంతో మన్సాన్ పల్లి ప్రభుత్వ పాఠశాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఈవో పర్యవేక్షణా లోపంతో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మేళసంఘం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కేవలం 26 మందే విద్యార్థులు చదువుతున్నారు. 6వ తరగతిలో 4, 7వ తరగతిలో 2, 8వ తరగతిలో 11, 9వ తరగతిలో 9 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ 10వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే తమ పిల్లలను
పంపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ శశికళ నిర్లక్ష్యంతోనే ఉపాధ్యాయులు ఇష్టం వచ్చినట్టు విధులకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాధికారి వెల్లడించారు. పాఠశాల ప్రారంభమై 94 రోజులు గడుస్తున్నా పాఠాలు బోధించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.