హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ)కు గుర్తింపు ఇవ్వాలని బీసీసీఐ పెద్దలను టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ కొత్త అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవిజత్ సైకియా, కోశాధికారి ప్రభ్తేజ్సింగ్ను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు.
హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 220 క్లబ్‌లు ఉంటే మిగిలిన 32 జిల్లాలకు తొమ్మిది ఉమ్మడి జిల్లా జట్లే ఉన్నాయని వివరించారు. ఈ విధానంతో తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా హెచ్‌సీఏ తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో మునిగిపోయిందని తెలిపారు.
మాజీ క్రికెటర్లు శివలాల్‌యాదవ్, అర్షద్ ఆయూబ్ సహా 42 మంది హెచ్‌సీఏ పెద్దలపై కేసులు ఉన్నాయన్నారు. అవినీతికి పరిమితమైన హెచ్‌సీఏతో తెలంగాణ క్రికెట్‌కు ఒరిగింది ఏం లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత క్రికెటర్లను దృష్టిలో పెట్టుకుని టీడీసీఏకు గుర్తింపు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా కోరారు.