జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం ఇరవైలలోనే సాధ్యమని, ముప్పైల్లోకి చేరుకున్న తర్వాత మన ఆలోచనా విధానం మారిపోతుందని, సమయం చేజారిపోతుందనే భావనతో ఉంటామని తాత్విక ధోరణిలో మాట్లాడింది అగ్ర కథానాయిక సమంత. తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ భామ ప్రేమ, జీవితం గురించి తన అభిప్రాయాల్ని పంచుకుంది. ఇరవైలలో ఏమాత్రం విరామం లేకుండా జీవితాన్ని గడిపానని, గుర్తింపు కోసం పడిన తాపత్రయం వల్ల ఎన్నో అనుభూతులకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది.
‘ఆ వయసులో నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోలేకపోయా. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని కాలక్రమంలో అర్థమైంది. ముప్పైల్లోకి చేరుకున్న తర్వాత మన జీవిత ప్రాధామ్యాలు, ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఏ విషయంలోనూ మునుపటి ఉత్సాహం కనిపించదు. అందుకే ఇరవైలలోనే జీవితాన్ని ఆస్వాదించాలి’ అని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను అందని వాటి వెంట పరుగులు తీయడం మానేశానని, గత జ్ఞాపకాలను చెరిపివేసుకొని ప్రశాంతంగా ఉంటున్నానని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.