వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వరద కాల్వ (Flood Flow Canal) మరమ్మతు పనులు పూర్తి అయినందున వరద కాలువను రివర్స్ పంపింగ్ ( Revers Pumping ) ద్వారా నింపి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) కోరారు. ఈ సందర్బంగా ఇరిగేషన్ శాఖ ఈఈ (Executive Engineer) లాల్ సింగ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఇటీవల దెబ్బతిన్న వరద కాల్వ మరమ్మతు పనులు పూర్తి అయినందున సబ్ కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం వల్ల పనులు నెమ్మదించినట్లు ఇరిగేషన్ ఈఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి తక్షణమే ఇరు వర్గాల కాంట్రా క్టర్లతో మాట్లాడి, ఒకట్రెండు రోజుల్లో వివాదాన్ని పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, అవసరమైతే తాను కూడా స్వయంగా ప్రధాన కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
వరద కాల్వపై ఏర్పాటు చేసిన తూముల (Sluices) ద్వారా నియోజకవర్గంలోని కాలువ పరిధి గ్రామాల చెరువులు నింపడానికి, ఆయా గ్రామాల రైతాంగానికి సాగునీరు అందించడానికి ఈ వరద కాల్వే ఏకైక ఆధారమని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 14 గేట్లు ఎత్తి 5.2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ లాల్ సింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వివరించారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎస్సారెస్పీ నుంచి గానీ లేదా కింది నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గానీ వరద కాల్వను పూర్తిగా నింపి, ఈ సీజన్లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.