Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘విశ్వంభర’ విడుదలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసినట్లు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ సినిమాను రాబోయే దసరా కానుకగా 2026, అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం సన్నాహలు చేస్తుంది. ది వెయిట్ ఈజ్ ఓవర్! మెగాస్టార్ చిరంజీవి ఎపిక్ ఫాంటసీ ‘విశ్వంభర’ దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది అంటూ పలువురు మీడియా, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టడంతో దసరా రాబోతుండటం పక్కా అని తెలుస్తుంది.
బ్లాక్బస్టర్ హిట్ ‘బింబిసార’ చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, అత్యుత్తమ అవుట్పుట్ కోసం భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు గ్రాఫిక్స్ పనులపై చిత్రయూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ‘అంజి’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాల తర్వాత చిరంజీవి నుండి వస్తున్న పూర్తి స్థాయి సోషియో-ఫాంటసీ సినిమా కావడంతో ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.