YouTuber Madhumitha : తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మధుమిత ఇంట్లో చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 98 సవర్ల (784 గ్రాములు) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. కన్యాకుమారి జిల్లా, రాజక్కమంగళం పోలీస్ స్టేషన్ పరిధి, తమ్మతుకోణంలో ఉన్న వీఐపీ గార్డెన్లోని ఒక ఇంట్లో యూట్యూబర్ మధుమిత, ఆమె భర్త వినోద్ కుమార్ కలిసుంటున్నారు.
మధుమిత తనకు ఉన్న నగల్ని, సంపదను ఎప్పుడూ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో మధుమి దగ్గర ఉన్న నగలు, సంపదపై దొంగల కన్ను పడింది. గత గురువారం దంపతులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని 118 సవర్ల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే, కొంత నగదు, ఇతర ఆభరణాల్ని కూడా దోచుకెళ్లారు. దీంతో మధుమిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. 16ం సీసీ కెమెరాలు, వివిధ కాల్ డేటాలు విశ్లేషించి దొంగల్ని పట్టుకున్నారు.
నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 98 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతోందని కన్యాకుమారి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు తమ ఇంట్లో అంత బంగారం చోరికి గురైనప్పటికీ మధుమతి ఆ తర్వాత కూడా తన నగలు, సంపదకు సంబంధించిన వీడియోల్ని యూట్యూబ్లో పోస్టు చేయడం విశేషం.