Vikatan Magazine | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 : ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై తమిళ మ్యాగజైన్ ‘వికటన్’ ప్రచురించిన కార్టూన్ సంచలనం రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ‘వికటన్’ మ్యాగజైన్ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ చర్యలు చేపట్టడం విమర్శలకు దారితీసింది. శుక్రవారం రాత్రి నుంచి ‘వికటన్’ వెబ్‌సైట్‌ను కేంద్రం బ్లాక్ చేసినట్టు తెలిసింది. కేంద్రం చర్యల్ని తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ నాయకులు ఖండించారు.
చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు కట్టి అమెరికా నుంచి భారతీయ వలసదార్లను బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ ‘వికటన్’ మ్యాగజైన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతులకు, కాళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకెళ్లు వేసినట్టుగా కార్టూన్ ప్రచురించింది. ఫిబ్రవరి 10న మ్యాగజైన్ కవర్‌పేజీపై ప్రచురించిన కార్టూన్ వివాదాస్పదమైంది.