హిమాయత్‌నగర్, జనవరి14: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఓ మంత్రితో పాటు ఐఏఎస్‌లను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలతో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, జర్నలిస్టులు సుధీర్, పరిపూర్ణచారిని అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న తలసాని మాట్లాడుతూ.. జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు సరికాదన్నారు. అరస్టైన జర్నలిస్టుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని వెంటనే వారిని విడుదల చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా మాధ్యమాల గొంతును నొక్కుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని తెలిపారు.ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడితప్పాయని, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ప్రభుత్వం పగపట్టినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. పండుగపూట ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు.