హైదరాబాద్, ఆట ప్రతినిధి: టాపార్డర్ దుమ్మురేపడంతో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. శనివారం గ్రూప్-ఈలో భాగంగా చండీగఢ్‌తో జరిగిన పోరులో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చండీగఢ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (106 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో ఆకట్టుకోగా.. హైదరాబాద్ బౌలర్లలో
రవితేజ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో ఠాకూర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు హనుమ విహారి (57), కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (34) నిలకడ తోడవడంతో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.