– ఆరెంపులలో బాలల మిస్సింగ్‌పై వీడిన సస్పెన్స్
ఖమ్మం రూరల్, డిసెంబర్ 19 : సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్ కుమారుడు అలాగే ఆయన ఇంటికి వచ్చిన సోదరి కుమారుడు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి ముందటికి వచ్చిన చిరు వ్యాపారి దగ్గర బేరం చేసుకుని పనిలో నిమగ్నమయ్యారు. ఈలోగా సదరు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ మెల్లగా ఇంట్లోకి వెళ్లారు. అయితే కొద్దిసేపటికి ఆడుకుంటున్న పిల్లలు కనపడకపోయేసరికి ఇంటికి తాళం వేసి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు.
ఎంతకీ కనపడకపోయేసరికి ఊర్లో ఉన్న సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులు, ఊరి బయట చెరువు, కాలువల్లో వెతకడం ప్రారంభించారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వాట్సాప్‌లో చిన్నారుల ఫొటోలు అప్లోడ్ చేసి మిస్సయిన పిల్లల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు అటు సోషల్ మీడియాలో, ఇటు గ్రామంలో, గ్రామ శివారుల్లో పిల్లల కోసం వెతికారు. చివరకు పిల్లల మిస్సింగ్ పై రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు సిద్ధపడగా కొందరు గ్రామస్తులు ఇచ్చిన సలహా ప్రకారం తాళం తీసి ఇంట్లో చూడగా పిల్లలు ఇంట్లోనే కనపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు.