హైదరాబాద్ : స్వరాష్ట్రంలో సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో ముందుకెళ్తూ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు మోడల్‌గా నిలుస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలు, సహపంక్తి భోజనాలకు హాజరయ్యారు. సాయంత్రం జంట పావురాలను వదిలి విజయదశమి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదర్శ పట్టణంగా ఉండడంతో పాటు శాంతియుత పట్టణంగా సూర్యాపేట ఎదగడం అభినందనీయమన్నారు.
ఇప్పటికే ఆరోగ్యవంతమైన సమాజంగా పట్టణానికి పేరుందన్నారు. సీఎం కేసీఆర్ సంకల్ప బలం నెరవేరిందని చెప్పారు. కొత్త రాష్ట్రంలో రైతు సంక్షేమం ఉండాలని ఆయన కన్న కలలకు ప్రకృతి తోడుకావడంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పసిడి రాసులతో నిండిపోయిందన్నారు. చాలినన్ని వర్షాలు చేతి నిండా పాడితో ప్రతి రైతుమోముల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోందన్నారు. సర్వమత సమ్మేళనంగా తెలంగాణ రాష్ట్రం వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవించడమే కాకుండా పండుగల్లో హిందు, ముస్లిం, క్రిస్టియన్లు అన్న తేడా లేకుండా పాల్గొనడడమే ఇందుకు నిదర్శనం అన్నారు.
కరోనాతో గతేడాది దసరా పండుగ జరుపుకోలేక పోవడమే కాకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న ప్రతి నిర్ణయంతో సురక్షితంగా బయటపడగలిగామన్నారు. కనిపించని శత్రువుపై జరుగుతున్న యుద్ధాన్ని కొనసాగించాలన్నారు. ఇందుకు మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గండూరీ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.