సూర్యాపేట, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల తరబడి కొనసాగుతున్న పోడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రికి ఇప్పటికే నివేదిక అందించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో మంత్రి గుంటకండ్ల ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పోడు భూములను సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని ఆదేశించారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. త్వరలో అఖిలపక్ష నేతలతోనూ సమావేశం కానున్నట్లు తెలిపారు. సమగ్ర అధ్యయనం అనంతరం సీఎం తీసుకునే నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు పోడు భూములపై హక్కులు కల్పించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్‌పాటిల్, పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, అటవీ శాఖ జిల్లా అధికారులు ముకుందరెడ్డి, రాంబాబు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం సూర్యాపేట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్మాణంలో ఉన్న మోడల్ మార్కెట్, అత్యంత అద్భుతంగా తయారై ఆకట్టుకుంటున్న సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ను కలెక్టర్లతో కలిసి మంత్రి సందర్శించారు.