సూర్యాపేట, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ బోగస్ సంస్థ జనానికి సుమారు రూ.1.50 కోట్లకు టోకరా వేసింది. 25 రోజుల క్రితం పట్టణంలోని కుడకుడ రోడ్డులో గృహోపకరణాల ఆర్డర్ అండ్ సప్లయ్ పేరిట గోల్డెన్ ఏజెన్సీని తమిళనాడుకు చెందిన వ్యక్తులు ప్రారంభించారు. ముందుగా డబ్బులు చెల్లిస్తే ఖరీదైన ఫర్నీచర్‌ను తక్కువ ధరకే ప్రతి 12 రోజులకోసారి అందిస్తామన్నారు. మొదటి వాయిదా అనుకున్న ప్రకారం వస్తువులు అందించడంతో ఆ వెంటనే జ నం సుమారు 350మంది ఎగబడి డబ్బులు చెల్లించారు. అంతే.. రెండో వాయిదా చెల్లించకుండా సుమారు రూ.1.50కోట్లతో బిచాణా ఎత్తివేశారు. రెండ్రోజులుగా దుకాణం తెరుచుకోకపోవడంతో డబ్బులు చెల్లించిన వారు అక్కడకు చేరుకొని ఏజెన్సీ వారు జెండా ఎత్తినట్లు తెలుసుకొని దాడికి పాల్పడి కొంతమేర ఫర్నీచర్‌ను లూటీ చేశారు.
25 రోజులు రూ.1.50కోట్లు మోసం
తమిళనాడుకు చెందిన వారు 25 రోజుల క్రితం సూర్యాపేటలో గోల్డెన్ ఏజెన్సీ దుకాణం ప్రారంభించారు. దుకాణంలో కొన్ని పేరున్న కంపెనీలకు చెందిన ఫ్రిజ్‌లు, బెడ్స్, మాట్రిసెస్, ఆఫీస్ టేబుళ్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, సోఫాలు, ఫ్యాన్లు గృహోపకరణాలు ఉంచి భారీ ఎత్తున బ్రోచర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. తాము నేరుగా ఆయా వస్తువులు తయారయ్యే ఫ్యాక్టరీ నుంచి హోల్‌సేల్‌లో కొనుగోలు చేస్తుండడంతో తక్కువ ధరకు వస్తాయని కొంతమేర లాభం చూసుకొని వినియోగదారులకు విక్రయిస్తామని ప్రతి 12రోజులకోసారి వస్తువులు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా వస్తువులు కావాలంటే డబ్బులు చెల్లించిన 12 రోజులకు అందిస్తామని నమ్మబలికారు.
రెండో వాయిదాకే ఎత్తివేత
ఏజెన్సీ ప్రారంభమైన మొదటి 12 రోజులకు అప్పటికే డబ్బులు చెల్లించిన వారికి వస్తువులు అందించారు. దీంతో తక్కువ ధరకు గృహోపకరణాలు వస్తున్నాయని నమ్మిన ప్రజలు ఒక్కొక్కరు సోఫాలు, ఫ్రిజ్‌లు, ఆఫీస్ టేబుళ్లు ఇలా అనేక వాటికి కలిపి రూ.40వేల చొప్పున చెల్లించేందుకు ఎగబడ్డారు. ఇలా రెండో వారంలో దాదాపు 350 మంది ఒక్కొక్కరు సుమారు రూ.40వేల నుంచి రూ.1.40లక్షల వరకు చెల్లించారు. మూడ్రోజుల క్రితం రెండో వాయిదా ప్రకారం డబ్బులు చెల్లించిన వారికి వస్తువులు అందించాల్సి ఉండగా అప్పటి నుంచి షాపు తెరుచుకోవడం లేదు. స్టాక్ తెచ్చేందుకు వెళ్లారనుకున్న వినియోగదారులు బుధవారం విచారణ చేయగా ఏజెన్సీ వారు ఉడాయించినట్లు తెలిసింది. దాదాపు 50 మంది వరకు గుమిగూడి ఒక్కసారిగా దాడి చేసి తాళాలు పగులగొట్టి దొరికిన కాడికి వస్తువులను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి షట్టర్ మూశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మాపై విశ్వాసం ఉంచమన్నరు..
మాపై విశ్వాసం ఉంచండి.. మీ డబ్బులకు మేము గ్యారంటీ అన్నరు. ఇంతకుముందు తీసుకున్న వారికి కొందరికి సామన్లు రావడంతో నమ్మి ముందే డబ్బులు కట్టా. ఇలా జరుగుతుందనుకోలేదు. కష్టపడి పైసా పైసా పోగు చేసిన సొమ్ము ఇలా కావడంతో ఏం చేయాలో పాలు పోవట్లేదు. మా ఇంట్లో ముందే వద్దన్నా నేనే వినకుండా డబ్బులు కట్టి నిలువునా మోసపోయాను. నేను వచ్చే సరికి షాపులోని వస్తువులన్నీ జనాలు దొరికినవి దొరికినట్టు తీసుకెళ్లారు. నిందితులపై విచారణ జరిపి పోలీసులు మాకు న్యాయం చేయాలి.
నమ్మితే.. నట్టేట ముంచారు
ఇంట్లో సామగ్రి సగం ధరకే ఇస్తామన్నరు. ఏ వస్తువు కావాలో ఆర్డర్ ఇచ్చి ముందే డబ్బులు చెల్లిస్తే 12 రోజుల్లో వస్తువులు మీ ఇంటి వద్దకే తెచ్చిస్తామన్నరు. మాపై నమ్మకం ఉంచండి అంటూ మమ్మల్ని నట్టేట ముంచారు. అతి తక్కువ ధరకు సామాన్లు వస్తున్నాయంటే నేను ముందే డబ్బులు చెల్లించా. నా గడువు దగ్గర పడుతున్న సమయంలో ఇలా కావడం బాధగా ఉంది. ముందుగా వచ్చిన వారిలో వస్తువులకు డబ్బులు కట్టిన, కట్టని వారు వస్తువులు ఎత్తుకెళ్లారు. నేను తీసుకుపోవడానికి వస్తువే దొరుకలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తా.
ఆర్డర్ ఇచ్చినవి వస్తే మళ్లీ ఆర్డర్ చేద్దామనుకున్నా..
వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తెలుసుకుని గోల్డెన్ ఏజెన్సీ అడ్రస్‌కు వెళ్లా. అక్కడ వస్తువులన్నీ చాలా అందంగా నాణ్యమైనవిగా ఉన్నాయి. సగం ధరకే అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. ఒక వేళ మోసం చేసే వారైతే ఇంత పెద్ద కాంప్లెక్స్‌లో ఇంత బాజాప్తాగా ఎలా పెడ్తారు అనుకున్నా. సమయానికి నా దగ్గర ఉన్న రూ.10వేలతో సామాన్లు ఆర్డర్ చేశా. రేపో మాపో రావాల్సి ఉండగా ఇలా జరిగింది. ఆర్డర్ ఇచ్చిన వస్తువులు వస్తే మళ్లీ ఆర్డర్ చేద్దామనుకున్నా. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులు, అధికారులు తగిన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి.