
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్02 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యేల కోటాలో ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. జిల్లా నుంచి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నలమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మదర్‌డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, గుత్తా తనయుడు అమిత్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : సుఖేందర్‌రెడ్డి
శాసనమండలి సభ్యుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం కల్పించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలి సభ్యుడిగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజా సేవకు అంకితం అవుతానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలనదక్షతతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అందులోభాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి తన వంతు కృషిని కొనసాగిస్తానని తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.