రంగారెడ్డి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ప్రభు త్వం స్పష్టం చేయడంతో అది ఏ మేరకు సాధ్యమవుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భూముల సర్వేకోసం జిల్లాలో వేలాది దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నా యి. ఏండ్లు గడుస్తున్నా
సర్వేకు నోచుకోకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ప్రభుత్వం కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 27 మండలాలకు 11 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్క సర్వేయర్ రెండు నుంచి మూడు మండలాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సర్వేయర్లు లేకుండా మ్యాప్‌లు ఎలా సాధ్యమని అధికారులు.. రైతులను వేధిస్తున్న ప్రశ్న. భూ భారతి చట్టం.. భూముల సమస్యలకు పరిష్కారం చూపుతుందని అనుకుంటే మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతున్నదని రైతులు వాపోతున్నారు. కొత్తగా సర్వేయర్లను నియమిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆ ని యామకం ఎప్పుడో కూడా స్పష్టత లేదు. దీంతో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మ రింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి.
పెండింగ్‌లో 10,000 దరఖాస్తులు
జిల్లాను కొంతకాలంగా సర్వేయర్ల సమస్య వేధిస్తున్నది. భూముల సర్వేకోసం జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ అప్లికేషన్లు సుమారు 10,000 వరకు ఉంటాయని అధికారుల అంచనా.. ఒక్కొ క్క సర్వేయర్ రెండు నుంచి మూడు మండలాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వ భూముల సర్వేతోపాటు ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు వంటి సర్వే పనులకూ వారినే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేయర్లు మండలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 11 మంది సర్వేయర్లు జిల్లాలో ని 23 మండలాలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులే సర్వేకు నోచుకోవడం లేదు. కొత్త గా భూభారతిలో రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ లు అవసరం అని తెరపైకి రావడంతో అది ఏ మేరకు సాధ్యమవుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మండలాల్లో భూముల సర్వేకోసం ప్రతిరోజూ రైతులు సర్వేయర్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరికొన్ని చోట్ల ప్రైవేట్ సర్వేయర్లను పెట్టి భూముల సర్వే చేయించుకుంటున్నారు. ప్రైవేట్ సర్వేయర్లు చేసిన సర్వేమ్యాప్లపై ప్రభుత్వ సర్వేయర్లు సంతకాలు పెట్టి పంచనామా నకల్ కూడా ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు ప్రైవే ట్ సర్వేయర్లు ఇష్టానుసారంగా సర్వే చేసి రైతుల మధ్య ఘర్షణలకు కారణమవుతున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు.
ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల సర్వేకే అధిక ప్రాధాన్యం..
జిల్లాలో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీ కోసం నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములను సర్వే చేసేందుకే అత్యధిక మంది సర్వేయర్లను వినియోగిస్తున్నారు. దీంతో కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వేయర్లే కనిపించడం లేదు. రైతుల భూములు సర్వే కావడమే లేదు. ఒక్కో రైతు తమ భూమిని సర్వే చేయాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఏడాది దాటుతున్నా సర్వే మాత్రం జరగడం లేదు.
ప్రైవేట్ సర్వేయర్లే కీలకం..
జిల్లాలో సర్వేయర్ల కొరత ఉండడంతో ఒక్కో సర్వేయర్ ప్రైవేట్ సర్వేయర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ సర్వేయర్ అందుబాటులో లేనప్పుడు వారితో గ్రామాల్లోని రైతుల భూములను సర్వే చేయిస్తున్నారు. ప్రైవేట్ సర్వేయర్లు చేసిన సర్వే మ్యాప్‌లపై ప్రభు త్వ సర్వేయర్లు సంతకాలు చేయడంతోపాటు వారు రాసిన పంచనామాలనూ ధ్రువీకరించి ఇస్తున్నారు. గ్రామాల్లో ప్రైవేట్ సర్వేయర్లు ఇష్టానుసారంగా సర్వేలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా డబ్బులు ఇచ్చిన వారి భూములను సర్వే చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇరుగుపొరుగు వారితో గొడవలు జరుగుతున్నాయి..
రెండు నుంచి మూడు మండలాలకు ఒక్కో సర్వేయర్ ఇన్చార్జిగా ఉండడంతో అస్సలు దొరకడమే లేదు. దొరికినా సమయం లేదని ప్రైవేట్ సర్వేయర్‌ను భూములను సర్వే చేసేందుకు పంపిస్తున్నారు. వారు చేసిన సర్వేతో ఇరుగుపొరుగు వారితో తగాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి సర్వేయర్ల కొరతను నివారించాలి.
-మైలారం విజయ్‌కుమార్
సర్వేయర్ల కొరతతో సమస్యలు
భూముల సర్వే కోసం దరఖాస్తులు చేసుకుని నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు, సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. తమ భూమిని సర్వేచేయాలని సంప్రదిస్తే.. ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని.. సమయం పడుతుందని దాటవేస్తున్నారు. సర్వేయర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో అన్నదా తలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ సర్వేయర్లను ఆశ్రయిస్తే ఇష్టానుసారంగా దండుకుంటున్నారు.
-బూడిద నర్సింహారెడ్డి