– 38, 39వ డివిజన్లలో క్షేత్రస్థాయిలో పరిశీలన
– పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం
నీలగిరి, జూన్ 16 : మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధి, పన్నుల వసూళ్ల లక్ష్యాల సాధనలో భాగంగా నల్లగొండ నగరంలోని 38, 39వ డివిజన్లలో చేపడుతున్న డిమాండ్ నోటీసుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి డిమాండ్ నోటీసుల పంపిణీ తీరును పరిశీలించిన కమిషనర్, ప్రతి ఆస్తి యజమానికి డిమాండ్ నోటీసు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులకు ఆస్తి పన్నులు, ఇతర మున్సిపల్ బకాయిల చెల్లింపుపై అవగాహన కల్పిస్తూ సకాలంలో పన్నులు చెల్లించేలా ప్రోత్సహించాలని సూచించారు. డిమాండ్ నోటీసుల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని, రోజువారీ ప్రగతిని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని కమిషనర్ తెలిపారు.
పన్నుల వసూళ్ల పెంపునకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని, బకాయిల వసూళ్లపై మరింత దృష్టి సారించాలని సూచించారు. ప్రతి వార్డు స్థాయిలో వసూళ్ల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని ఆదేశించారు. నగరాభివృద్ధి, పౌరులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనలో మున్సిపల్ ఆదాయం కీలక పాత్ర పోషిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. పౌరులు తమ పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పన్నుల ద్వారా సమకూరే ఆదాయంతో రహదారులు, పారిశుధ్య సేవలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పట్టణ సుందరీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని వివరించారు.
అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను వెంటనే పరిష్కరించి పన్నుల చెల్లింపుపై సానుకూల వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్ని డివిజన్లలో డిమాండ్ నోటీసుల పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి పన్నుల వసూళ్లలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ తనిఖీలో రెవెన్యూ అధికారి జి. శివరాం రెడ్డి, సంబంధిత వార్డు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

డిమాండ్ నోటీసుల పంపిణీపై నల్లగొండ కమిషనర్ ఆకస్మిక తనిఖీ